
హ్యాకింగ్.. షేకింగ్..
హ్యాకింగ్... ప్రపంచ ఆన్‌లైన్ భద్రతనే ప్రశ్నిస్తున్న పదం.
హ్యాకింగ్... ప్రపంచ ఆన్‌లైన్ భద్రతనే ప్రశ్నిస్తున్న పదం. మామూలు దొంగలకు దొంగతనం చేయాలంటే తలుపులు పగలగొట్టాలి. గోడలకు కన్నాలు వేయాలి. మారణాయుధాలతో బెదిరించాలి. కానీ హ్యాకర్లకు అవేమీ అవసరం లేదు. ఓ కంప్యూటర్, దానికి ఇంటర్నెట్, కొన్ని ఇతర పరికరాలు ఉంటే చాలు. ఇంట్లో కూర్చుని కాళ్లు కదలకుండా కోట్లు కొట్టేస్తారు. దేశాల ఆర్థిక వ్యవస్థలనే ఛిన్నాభిన్నం చేస్తారు. ఎంత పెద్ద కంపెనీలనైనా కాళ్ల బేరానికి రప్పిస్తారు. ప్రపంచదేశాలన్నిటికీ పెద్దన్న లాంటి అమెరికానే హ్యాకర్లు కొన్ని గంటల పాటు స్తంభింపజేయడం ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఆన్‌లైన్ వ్యవస్థ భద్రతపైనే ప్రస్తుతం సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
హ్యాకింగ్ అంటే అనుమతి లేకుండా మన ఎలక్ట్రానిక్ పరికరాల్లోకి ప్రవేశించడం. మన ఇంట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించిన వారిని దొంగలు అని ఎలా అంటామో వీరు కూడా అంతే. హ్యాకర్ అనే పదం 1980ల్లో మొదటిసారి వాడుకలోకి వచ్చింది. ఈ పదానికి వేర్వేరు అర్థాలున్నప్పటికీ ప్రధానంగా ఈ అర్థంతోనే ప్రపంచానికి తెలుసు.
ప్రపంచాన్నే కుదిపేసిన హ్యాకింగ్ సంఘటనలివే....
అమెరికాపై సైబర్ దాడి – 2016
ఈ సంఘటన తాజాగా జరిగింది. గత శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా ట్వీటర్, అమెజాన్, టంబ్లర్, రెడిట్ వంటి వెబ్‌సైట్ల సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోయాయి. నగదు బదిలీకి అవసరమైన పేపాల్ కూడా పనిచేయలేదు. ఇంటర్నెట్‌కు అనుసంధానమయ్యే వెబ్ కెమెరాలు, రూటర్లు, సెట్‌టాప్ బాక్సులు, డీవీఆర్‌ల సాయంతో హ్యాకర్లు సైబర్‌దాడి చేశారు. అక్కడి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రెండు గంటల పాటు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తెచ్చినప్పటికీ హ్యాకర్లు మళ్లీ విరుచుకుపడటంతో మరో మూడు గంటల పాటు సేవలకు అంతరాయం కలిగింది. కేవలం అమెరికాలో కాకుండా యూరోప్‌లో కూడా ఈ తరహా సమస్యలు ఎదురయినట్లు కొన్ని సంస్థలు తెలిపాయి.
భారత్‌లో డెబిట్ కార్డుల బ్లాక్ – 2016
‘యస్ బ్యాంకు’కు సేవలందిస్తున్న ‘హిటాచీ పేమెంట్ సర్వీసెస్’ అనే సంస్థ కంప్యూటర్లలోకి మాల్‌వేర్(దొంగ సాఫ్ట్‌వేర్)ను పంపి వినియోగదారుల సమాచారాన్ని దొంగిలించారు. భారతదేశంలో ఏటీయం నెట్‌వర్క్ అన్ని బ్యాంకులతో అనుసంధానమై ఉండటం వల్ల అన్ని బ్యాంకుల ఖాతాదారుల సమాచారం చైనా దొంగల చేతికి చేరింది. ఈ వ్యవహారం మే, జూన్‌ల్లోనే జరిగినప్పటికీ తమ ఖాతాల్లోని సొమ్ము పోయిందని వినియోగదారులు సెప్టెంబరులో ఫిర్యాదులు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే 641 మంది ఖాతాదారుల నుంచి సొమ్ము పోయిందని ఫిర్యాదులు వచ్చాయి. ఈ లావాదేవీల విలువ రూ. 1.3 కోట్లు. దీంతో ముందస్తు జాగ్రత్తగా భారతదేశంలోని బ్యాంకులన్నీ కలిపి దాదాపు 32 లక్షల డెబిట్ కార్డులను బ్లాక్ చేశాయి. ఈ వ్యవహారంతో దేశ బ్యాంకింగ్ వ్యవస్థ భద్రతపైనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్–2014
సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్రూపు మనందరికీ సుపరిచితమే. హాలీవుడ్ సినిమాలను రూపొందించే ఈ కంపెనీ వార్షిక టర్నోవరు కొన్ని దేశాల బడ్జెట్ కంటే ఎక్కువగా ఉంటుంది. స్పైడర్ మ్యాన్, మెన్ ఇన్ బ్లాక్, రెసిడెంట్ ఈవిల్ లాంటి ప్రఖ్యాత చిత్రాలను ఈ సంస్థే నిర్మించింది. అయితే 2014, నవంబరు 14న ఈ సంస్థకు సంబంధించిన అన్ని కీలక పత్రాలు, ఉద్యోగుల సమాచారం, ఆ సంస్థ నిర్మిస్తున్న ‘ది ఇంటర్వ్యూ’ అనే సినిమా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. ‘గార్డియన్స్ ఆఫ్ పీస్’ అని తనకు తానే పేరు పెట్టుకున్న కొంతమంది హ్యాకర్లు ఇది తమ పనే అని ప్రకటించారు. ఈ చిత్రం ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ మీద వ్యంగ్యాత్మకంగా ఉంటుందని వార్తలు రావడంతో ఈ పని ఉత్తర కొరియా వారిదే అయి ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా వార్తలు వచ్చాయి. అప్పటికి నిర్మాణంలో ఉన్న జేమ్స్‌బాండ్ చిత్రం ‘స్పెక్టర్’ స్క్రిప్టు కూడా లీకయిందని వార్తలు వచ్చినప్పటికీ ఆ స్క్రిప్టుకు వారు పేటెంట్ హక్కులు పొందడంతో ఎటువంటి నష్టం జరగలేదు.
2015–16 స్విఫ్ట్ బ్యాంక్ హ్యాకింగ్
ఈ ఆన్‌లైన్ దాడికీ, పైన పేర్కొన్న దాడికీ సంబంధాలుండి ఉంటాయని, రెండిటికీ పాల్పడింది ఉత్తర కొరియాకు చెందిన వారేనని ప్రపంచ దేశాలు అభిప్రాయపడుతున్నాయి. అసలేం జరిగిందంటే బంగ్లాదేశ్ జాతీయ బ్యాంకుకు చెందిన సుమారు రూ. 550 కోట్లను అక్రమంగా న్యూయార్క్‌కు చెందిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంకుకు తరలించారు. దీన్ని ‘స్విఫ్ట్ అలయన్స్ యాక్సెస్’ అనే సాఫ్ట్‌వేర్‌నుపయోగించి తరలించారు. వెంటనే ఇలాంటి సంఘటన ‘వియత్నాం కమర్షియల్ బ్యాంకు’లో కూడా జరిగింది.
2001–02 అమెరికా మిలటరీ కంప్యూటర్ల హ్యాకింగ్
గ్యారీ మెక్‌కానోన్ అనే ప్రబుద్ధుడు 2001 ఫిబ్రవరి నుంచి 2002 మార్చి మధ్య 13 నెలల కాలంలో అమెరికా మిలటరీ, నాసాకు చెందిన 97 కంప్యూటర్లను హ్యాక్ చేశాడు. ఇదంతా అతను ఇంగ్లండ్‌లోని తన ప్రియురాలి ఇంట్లో కంప్యూటర్ నుంచి చేయడం విశేషం. ఈ ఘటన ప్రపంచంలోనే అతి పెద్ద మిలటరీ సైబర్ నేరం. అయితే ఇతను అందులోని డేటాని దొంగిలించలేదు. మొత్తం సమాచారాన్ని డిలీట్ చేసేశాడు. అయితే ఇతనికి శిక్ష విధించే విషయంలో అమెరికా, ఇంగ్లండ్‌ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇప్పటికీ దర్జాగా తిరుగుతున్నాడు.
ఇవే కాకుండా ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ట్వీటర్ పాస్‌వర్డ్ ‘డాడాడా’ అని ఓ ప్రముఖ హ్యాకింగ్ సంస్థ ప్రకటించడం, అదే విధంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సామాజిక మాధ్యమాల ఖాతాలు కూడా హ్యాకింగ్‌కు గురయ్యాయని తెలియడంతో సైబర్ భద్రతపై ఉన్న అనుమానాలు రెట్టింపు అయ్యాయి. తాజాగా ట్వీటర్ సీఈవో జాక్‌డోర్సే ట్వీటర్ ఖాతాను అవర్‌మైన్ అనే హ్యాకర్ల గ్రూపు హ్యాక్ చేసి ట్వీట్లు వేసింది. అయితే తాము సైబర్ భద్రతను పరీక్షించడానికే ఈ పని చేశామని వారంటున్నారు.
‘పాస్‌వర్డే’ ప్రాణం...
ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఏం చేయాలన్నా ‘పాస్‌వర్డ్’ తప్పని సరి. పాస్‌వర్డ్ తెలిస్తే నీ వ్యక్తిగత జీవితంలోకైనా, ఆర్థిక జీవితంలోకైనా చాలా సులభంగా ప్రవేశించవచ్చు. కాబట్టి ప్రధానంగా పాస్‌వర్డ్‌లు కనుక్కోవడమే వీరి పని. దీనికి వీరు రకరకాల పద్ధతులు అవలంబిస్తారు. పాస్‌వర్డ్ క్రాకింగ్, స్పూఫింగ్ ఇందులో ప్రధానమైనవి.
► పాస్‌వర్డ్ క్రాకింగ్‌లో మన పాస్‌వర్డ్‌ను అంచనా వేయడానికి హ్యాకర్లు ప్రయత్నిస్తారు.
► ఫిషింగ్ అంటే వివిధ రకాల ఈ–మెయిల్స్ ద్వారా మన పాస్‌వర్డ్‌ను కనుగొనడానికి ప్రయత్నించే విధానం. ఉదాహరణకు ‘మీరు లాటరీలో డబ్బు గెలుచుకున్నారు. డబ్బు మీ బ్యాంకు ఖాతాకు మళ్లించుకోవడానికి లాగిన్ అవ్వండి’ ఇలాంటివి ఫిషింగ్ మెయిల్స్. వీటి ద్వారా పాస్‌వర్డ్‌ను కోల్పోతే స్వయంకృతాపరాధమే అనవచ్చు. కాబట్టి అనవసరమైన మెయిల్స్‌కు స్పందించకుండా ఉండటమే మంచిది.
► డెబిట్ కార్డు పిన్ నంబరు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండటం, ఈ వివరాలను ఎవరికీ తెలియజేయకపోవడం వంటి ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వీటి బారిన పడుకుండా ఉండవచ్చు.
► సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత వివరాలు, ఉంచకపోవడం, అనవసర ఫోన్‌కాల్స్, ఈ–మెయిల్స్‌కు స్పందించకుండా ఉండటం మంచిది.
హ్యాకర్లు ప్రధానంగా మూడు రకాలు
వైట్ హ్యాకర్లు:
వీరు సంస్థల కోసం పని చేస్తారు. తాము పని చేసే సంస్థల ఆన్‌లైన్ భద్రతను పరీక్షిస్తారు. తమ సంస్థల వెబ్‌సైట్లను తామే హ్యాక్ చేస్తారు. తద్వారా కంపెనీల ఆన్‌లైన్ భద్రతను మెరుగుపరచడమే వీరి పని.
బ్లాక్ హ్యాకర్లు:
వీరినే మనం నేరగాళ్లు అనవచ్చు. ఎందుకంటే వీరు తమ స్వప్రయోజనాల కోసం ఆయా వ్యక్తులు, సంస్థల కంప్యూటర్లలోకి చొరబడతారు. అనంతరం దాన్ని తస్కరించడమో, నాశనం చేయడమో చేస్తారు. తస్కరించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టే కేటుగాళ్లు కూడా ఉన్నారు. ఇతరుల బ్యాంక్ సమాచారం కాజేసి వారి ఖాతాల్లోని సొమ్ము కొట్టేయడం కూడా వీరి హస్తలాఘవమే. వీరి నుంచి తమ ఆన్‌లైన్ వ్యవస్థను ఎలా కాపాడుకోవాలో తెలీక అన్ని దేశాలూ తల పట్టుకుంటున్నాయి.
గ్రే హ్యాకర్లు:
పేరుకు తగ్గట్టే వీరు వైట్, బ్లాక్ హ్యాకర్లకు మధ్య తరహా అని చెప్పవచ్చు. ఆయా కంపెనీలు, వ్యక్తుల అనుమతి లేకుండా వారి కంప్యూటర్లు హ్యాక్ చేస్తారు. కానీ ఆ విషయం వారికి తెలియజేసి వారి వద్ద నుంచి పారితోషికం తీసుకుంటారు. అవసరమైతే వారి కంప్యూటర్ రక్షణ బాధ్యత కూడా వీరే తీసుకుంటారు.
వీరు కాకుండా ‘స్క్రిప్ట్ కిడ్డీస్’ అనే మరో రకం హ్యాకర్లు ఉన్నారు. వీరికి తగినంత సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా వేరే హ్యాకర్లు రాసిన లేదా తయారు చేసిన ప్రోగ్రాంలను ఉపయోగించి హ్యాకింగ్‌కు పాల్పడతారు.
– ఏలేటి సాకేత్ రెడ్డి, సాక్షి, ఏపీ డెస్క్