
తిరువనంతపురం: కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారిని దీటుగా నిలువరించేందుకు కోవిడ్-19 నిబంధనలను ఏడాది పాటు పొడిగిస్తూ ఎపిడెమిక్ డిసీజ్ ఆర్డినెన్స్‌ను సవరించింది. రాష్ట్రంలో కోవిడ్-19 క్రమంగా వ్యాప్తి చెందుతుండటంతో కేరళ ప్రభుత్వం మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిబంధనలు వచ్చే ఏడాది జులై వరకూ లేదా తదుపరి ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసేవరకూ అమల్లో ఉంటాయని పేర్కొంది. తాజా నిబంధనల ప్రకారం 2021 జులై వరకూ ప్రజలు మాస్క్‌లను ధరించడం, భౌతిక దూరం పాటించడం, జనసమూహాలకు దూరంగా ఉండటం వంటి ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కోవిడ్-19 నిబంధనలు సరిగ్గా అమలయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. (ఆ ఔషధం ట్రయల్స్ నిలిపివేత: డబ్ల్యూహెచ్‌వో)
నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేరళ ఎపిడెమిక్ డిసీజెస్ ఆర్డినెన్స్ నిబంధనల కింద చర్యలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక కోవిడ్-19 నిబంధనల ప్రకారం వివాహ వేడుకల్లో 50 మందికి మించకుండా పాల్గొనడంతో పాటు మాస్క్‌లు ధరించి, శానిటైజర్ ఉపయోగించాలి. అతిథుల మధ్య కనీసం ఆరు అడుగుల దూరం పాటించాలి.అంత్యక్రియలకు 20 మందికి మించకుండా కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతిస్తారు. రోడ్లు, బహిరంగ ప్రదేశాలు, ఫుట్‌పాత్‌లపై ఏ ఒక్కరూ ఉమ్మివేసినా కఠిన చర్యలు చేపడతారు. అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి వేడుకలు, గెట్ టు గెదర్, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించడం నిషేధం. ఈ తరహా కార్యక్రమాలకు ముందస్తు అనుమతితో కేవలం 10 మందిని అనుమతిస్తారు. అలాగే షాపులు, వాణిజ్య సంస్థలు సైతం వచ్చే ఏడాది జులై వరకూ కోవిడ్-19 నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. చదవండి : ఇల్లు ఖాళీ చెయ్