తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణకు ప్రత్యేక హోదా కల్పించాలని మోడీకి విజ్ఞప్తి చేశారు.
న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణకు ప్రత్యేక హోదా కల్పించాలని మోడీకి విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రపంచ మేయర్ల సదస్సుకు హాజరు కావాలని కేసీఆర్.... ప్రధానిని ఆహ్వానించారు. అక్టోబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న మెట్రోపోలీస్ సదస్సుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని, ప్రధాని మోడీని ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్న విషయం తెలిసిందే.
అక్టోబర్ 7 నుంచి 10వ తేదీ వరకు జరిగే ఈ సదస్సుకు 60 దేశాల నుంచి వివిధ నగరాల మేయర్లు, అధికారులు హాజరుకానున్నారు. ఈ సదస్సును ఉపయోగించుకుని రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని సర్కారు యోచిస్తోంది. అందులో భాగంగా సదస్సు ప్రారంభోత్సవాన్ని ప్రధాని చేతుల మీదుగా చేయించాలని, ముగింపు సమావేశానికి రాష్ట్రపతిని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో హస్తిన పర్యటనకు వెళ్లిన కేసీఆర్..ఈ సదస్సుకు రావాల్సిందిగా మోడీని స్వయంగా ఆహ్వానించారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు రాష్ట్రపతిని కలవనున్న కేసీఆర్... మేయర్ల సదస్సుకు ఆహ్వానించనున్నారు.