
సాక్షి,న్యూఢిల్లీ: నూతన సంవత్సరంలో కుల, మత విద్వేషాలు లేని అవినీతి రహిత నవ భారత్‌కు నాంది పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. కొత్త ఏడాదిలో అడుగుపెడుతున్న వేళ 21వ శతాబ్దంలో జన్మించి ఓటు హక్కు పొందడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలోకి ప్రవేశిస్తున్న వారిని స్వాగతిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో మహత్తర ఆయుధమైన ఓటుతో దేశ రూపురేఖలను మార్చవచ్చని అన్నారు. గత నెలలో సానుకూల భారత్ ఆవిష్కారానికి సూచనలు చేయాలని తాను కోరిన మీదట పలు నిర్మాణాత్మక సూచనలు వచ్చాయని చెప్పారు. యువత కోసం నూతన అవకాశాలు అందుబాటులోకి తెచ్చామన్నారు.
నైపుణ్యాభివృద్ధి నుంచి యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ప్రక్రియ ఊపందుకుందని చెప్పారు. అభివృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేలా నవభారత యువతను ప్రోత్సహిస్తున్నామన్నారు. 2018 రిపబ్లిక్ వేడుకలకు ఆసియా నేతలను భారత్ ఆహ్వానిస్తున్నదని చెప్పారు.
పలు ఆసియా నేతలు తొలిసారిగా గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిధులుగా హాజరవుతారని తెలిపారు. ముస్లిం మహిళల సాధికారత కోసం తమ ప్రభుత్వం ఏడు దశాబ్ధాల నాటి ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసే చర్యలు చేపట్టిందని చెప్పారు.