భారీ వర్షాలతో అల్లాడుతున్న తమిళనాడులోని దుర్భర పరిస్థితులను తాను స్వయంగా చూశానని, రాష్ట్రంలో తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు.
చెన్నై: భారీ వర్షాలతో అల్లాడుతున్న తమిళనాడులోని దుర్భర పరిస్థితులను, జరిగిన నష్టాన్ని తాను స్వయంగా చూశానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఈ ఆపత్కాలంలో తమిళనాడు ప్రజలతో భుజం భుజం కలిపి.. కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు. సహాయ కార్యక్రమాల కోసం స్వతరమే రూ. వెయ్యి కోట్లు తమిళనాడుకు విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు ఆయన స్పష్టం చేశారు. గతంలో వర్షాల సందర్భంగా కేంద్రం తమిళనాడుకు రూ. 940 కోట్ల సహాయం అందజేసిందని, దానికి అదనంగా ప్రస్తుతం ఈ మొత్తాన్ని ఇస్తున్నామని ప్రధాని ట్విట్టర్ లో తెలిపారు.
వర్షాలకు ఛిన్నాభిన్నమైన తమిళనాడులోని చెన్నై, కంచిపురం, తిరువళ్లూరు జిల్లాల పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. అంతకుముందు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో భేటీ రాష్ట్రంలోని బీభత్సంపై అడిగి తెలుసుకున్నారు.