
సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలసి వినతిపత్రం అందిస్తున్న కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, జానా, భట్టి, జీవన్‌రెడ్డి, నాగం, సురేశ్‌రెడ్డి, దాసోజు తదితరులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల విషయంలో న్యాయం చేయాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలసి వినతిపత్రం అందజేసింది. తమ ఎమ్మెల్యేలను అన్యాయంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని, వారి శాసనసభ్యత్వాలను పునరుద్ధరించాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదని కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు.
తీర్పు వచ్చి 20 రోజులవుతున్నా ప్రొటోకాల్, ఇతర హక్కుల విషయంలో శాసనసభ్యులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని గవర్నర్‌కు చెప్పారు. వెంటనే శాసనసభ్యుల హక్కులు కాపాడేలా ప్రభుత్వాధినేతగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌ను కలసిన వారిలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మావతిరెడ్డి, దొంతి మాధవరెడ్డి, పద్మావతి, ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, ముఖ్య నేతలు నాగం జనార్దనరెడ్డి, దాసోజు శ్రవణ్‌కుమార్, గూడూ రు నారాయణరెడ్డి, నేరెళ్ల శారద తదితరులు ఉన్నారు.
సానుకూల స్పందన: ఉత్తమ్
గవర్నర్‌ను కలసిన అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో తాము అన్ని విషయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. గవర్నర్ తమ విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించారని ఆయన వెల్లడించారు.
సీఎస్‌ను కలసి వినతిపత్రం
ఆ తర్వాత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లుభట్టి విక్రమార్క నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సి.ఎస్.జోషిని కాంగ్రెస్ ప్రతినిధి బృందం కలిసింది. సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సంపత్‌కుమార్, పద్మావతి, వంశీచంద్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారదలతో కలసి సచివాలయంలో ఆయనకు వినతిపత్రం అందజేశారు. కోర్టు తీర్పు ప్రకారం వెంటనే ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలను పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని సీఎస్‌ను కోరారు.
ఏమో.. నాకా చరిత్ర తెలియదు: కాంగ్రెస్ నేతలతో గవర్నర్
కాంగ్రెస్ నేతలు తనను కలసిన సందర్భంగా వారు చెప్పిన విషయాలన్నింటినీ గవర్నర్ నరసింహన్ సావధానంగా విన్నారు. ‘తప్పకుండా పరిశీలిస్తాను’ అని పలుమార్లు కాంగ్రెస్ నేతలకు ఆయన చెప్పారు. అయితే, భేటీ చివర్లో గవర్నర్ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేసినట్టు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. భేటీ ముగిసే సమయంలో సీనియర్ నేత నాగం జనార్దనరెడ్డి గవర్నర్ దృష్టికి ఓ విషయం తీసుకువచ్చారు. 1952 నుంచి ఇప్పటివరకు దేశంలో ఎక్కడా ఇలా ఎమ్మెల్యేలను బహిష్కరించలేదని గవర్నర్‌కు జనార్దనరెడ్డి చెప్పారు. దీనికి స్పందించిన గవర్నర్ ‘ఏమో నాకు తెలియదు. నేను 1952లో ఏడో తరగతి చదువుతున్నా. ఆ చరిత్ర నాకెలా తెలుస్తుంది’ అని తనదైన శైలిలో వ్యాఖ్యానించినట్లు సమాచారం.