
సాక్షి, అమరావతి : గతంలో వ్యవస్థలను మెనేజ్ చేసినట్లుగా బుధవారం చంద్రబాబు నాయుడు శాసన మండలిని ప్రభావితం చేసి బిల్లులను అడ్డుకున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగాన్ని పాటించకపోతే ప్రజలు నిస్సహాయులుగా మిగిలిపోతారని ఆవేద వ్యక్తం చేశారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ..ప్రభుత్వ నిర్ణయాలను మండలి ఆపలేదన్నారు. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు చేసే ఆస్కారం ఉన్న శాసన మండలి అవసరమా లేదా అన్నది ప్రజాస్వామ్యవాదులంతా ఆలోలించాలని కోరారు.
(చదవండి : నిబంధనలు పాటించడమే చైర్మన్ బాధ్యత: కన్నబాబు)
మండలి అనేది అవసరమే లేదని ఎన్జీ రంగా నాడే చెప్పారని గుర్తు చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన నిర్ణయాలను అడ్డుకుంటే.. అది ప్రజలను అవమానించినట్లేనని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య లక్ష్యాన్ని దెబ్బతీసేవిధంగా టీడీపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. నిన్న మండలిలో జరిగిన పరిణామాలు సమయాన్ని వృధా చేయాలన్నట్లుగానే ఉన్నాయన్నారు. బిల్లులను అడ్డుకొని చంద్రబాబు నాయుడు నాలుగు నెలల కాలాన్ని మింగేస్తాడేమో కానీ అంతకు మించి ఏమి చేయలేరన్నారు. శాసన మండలి అవసరమా లేదా అనే దానిపై చర్చ జరగాలని, దీని కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి, స్పీకర్‌ను కోరారు.