
సాక్షి, సంగారెడ్డి : కేసీఆర్‌కు, బీజేపీకి వ్యతిరేకంగా నేనెలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వననీ, మీరు కూడా మాట్లాడవద్దని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కార్యకర్తలకు సూచించారు. శుక్రవారం కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం కేసీఆర్ దగ్గర తల వంచుతానని, మనకిప్పుడు అదే ముఖ్యమన్నారు. మరోవైపు తన మాట, ప్రవర్తన వెనుక ఎత్తుగడ ఉంటందని స్పష్టం చేశారు. ప్రత్యేక వ్యూహంతోనే నేను మాట్లాడతానని వెల్లడించిన జగ్గారెడ్డి, తాను ఏది చేసినా నియోజకవర్గం, కాంగ్రెస్ కార్యకర్తల కోసమే చేస్తానని వ్యాఖ్యానించారు. కాగా, ఒకవైపు రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన జగ్గారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకొంది.