
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని స్వయంగా విధ్వంసం చేసిన సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ ఢిల్లీకి వెళ్లడం ఏమిటని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు చంద్రబాబు ఒక ఆషాఢభూతి అని.. ఆయనపై ఏపీ ప్రజల ఆగ్రహం ఓట్ల రూపంలో కట్టలు తెంచుకుందన్నారు. వివిధ ప్రాంతాల్లో నివసిస్తూ ఏపీలో ఓటు హక్కు ఉన్న వారంతా పోలింగ్ రోజున ఏపీకి వచ్చి ఓటింగ్‌లో పెద్దఎత్తున పాల్గొన్నారని, చంద్రబాబుకు వ్యతిరేకంగా వారిలోని విపరీతమైన కసి ఆ రోజు పెల్లుబుకిందన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును ఓడిద్దామని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన రాష్ట్ర ప్రజలు వస్తే.. తనను గెలిపించడానికే వారొచ్చారని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు.
40 ఏళ్ల అనుభవమున్న చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంటే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చాలా హుందాగా వ్యవహరించారన్నారు. కాగా, తనకు ఓటమి తప్పదని భావించిన చంద్రబాబు ఇతరులను నిందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. 30 శాతం ఈవీఎంలు పనిచేయలేదని, వీవీప్యాట్లలో లోపాలున్నాయని, హింస ప్రజ్వరిల్లిందని బాబు విమర్శలు చేశారని, ఈ కారణాలు చూపుతూ ఆయన రీపోలింగ్‌కు కూడా డిమాండ్ చేశారని రామచంద్రయ్య గుర్తుచేశారు. కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని.. ఆయనను నిరాశా నిస్పృహలు ఆవహించాయన్నారు. ఇంటెలిజెన్స్ డీజీ, ఎస్పీలను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాలు కూడా ఫలించలేదని రామచంద్రయ్య అన్నారు. ఏపీలో చంద్రబాబు ఏం చేసినా ఎల్లో మీడియా ఆయనకు వత్తాసు పలుకుతోందని.. చంద్రబాబుకు దమ్ముంటే జాతీయ మీడియాను ఎదుర్కోవాలని రామచంద్రయ్య సవాలు విసిరారు.
చంద్రబాబు ఓడిపోతున్నారు
ఈ ఎన్నికల్లో పెద్దఎత్తున నిధులు పారించినా చంద్రబాబు ఓడిపోతున్నారని రామచంద్రయ్య అన్నారు. చంద్రబాబు ఢిల్లీలో అన్నా హజారేను కలవడానికి వెళ్తే.. వారు ఆయన్ను రానివ్వలేదన్నారు. వీవీప్యాట్‌లో ఆయన ఓటు కనపడకపోతే అధికారులకు ఫిర్యాదు చేశారా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం డీజీపీ కార్యాలయానికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తే తప్పేముందన్నారు. ఏపీకి పట్టిన చంద్రగ్రహణం ఈ ఎన్నికల్లో వీడిందని.. ఆయన ఓటమిని హుందాగా అంగీకరించాలని సూచించారు.