
చింతలపాలెం (హుజూర్‌నగర్): హుజూర్‌నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను, నాయకులను బెదిరించి, భయపెట్టి టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ప్రకటించిన తర్వాత టీఆర్‌ఎస్ నేతల ఒత్తిడి ఎక్కువైందని అన్నారు. తాము కూడా 10 సంవత్సాలు అధికారంలో ఉన్నామని, అయితే ఇలా చేయలేదని, బలవంతంగా కండువాలను కప్పడం పద్ధతి కాదన్నారు. పెద్ద పదవిలో ఉన్న వారు ప్రజాస్వామ్యాన్ని, పద్ధతులను గౌరవించాలని కోరుకుంటున్నామని ఉత్తమ్ చెప్పారు. కండువాలు కప్పడం గొప్ప కాదని, ప్రజల మనసులను గెలవడం గొప్పని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ నేతల బెదిరింపులకు భయపడి పార్టీ మారిన కాంగ్రెస్ నాయకులు తిరిగి రావాలని ఉత్తమ్ పిలుపునిచ్చా రు. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి 30 వేల మెజారిటీతో గెలుస్తుందని పేర్కొన్నారు.