
సాక్షి, న్యూఢిల్లీ : అపరిపక్వతతో కూడిన వ్యాఖ్యలు చేయటం వల్లనే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిని అందరూ పప్పు అంటున్నారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎద్దేవా చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ సంస్థలో మహిళలపై వివక్ష చూపుతున్నారని, ఆర్‌ఎస్‌ఎస్ శాఖల్లో ఎక్కడా స్కర్ట్స్ (నిక్కర్లు) ధరించిన మహిళలే కానరారంటూ ఇటీవల రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేగిన విషయం తెలిసిందే.
అయితే ఈ వ్యాఖ్యలపై సీఎం యోగి స్పందిస్తూ... రాహుల్ నోటి వెంట వచ్చే అలాంటి మాటలే ఆయన పరిపూర్ణత సాధించలేదనటానికి నిదర్శనమని ప్రజలు భావించి పప్పు అని అంటున్నారన్నారు. శుక్రవారం ఆయన గుజరాత్‌లోని వల్సాడ్‌లో జరిగిన సభలో మాట్లాడారు. రాహుల్ గాంధీ వెళ్లిన ప్రతిచోటా కాంగ్రెస్ పార్టీకి ఓటమి తథ్యమన్నారు. మరోవైపు రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీకి చెందిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ మాటలు అసభ్యకరంగా ఉన్నాయన్నారు.