
హైదరాబాద్ : మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యవసాయశాఖ సమీక్షలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంటల కాలంలో రైతుల బాగుకోసం పనిచేయని మంత్రి అధికారం ముగిసిపోనున్న తరుణంలో సమీక్షలు చేయడమేంటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి చురకలంటించారు. వ్యవసాయ సీజన్ ఎప్పుడో కూడా చంద్రమోహన్‌రెడ్డికి తెలియదని ఎద్దేవా చేశారు. తుపాన్ పేరుతో డబ్బులు దొబ్బేయడానికే ఈ డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘5 ఏళ్లుగా రైతులకు రుణభారాన్ని పెంచారు. వ్యవసాయ మంత్రిగా ఉన్న సోమిరెడ్డి ఏనాడూ వ్యవసాయం గురించి, రైతుల సమస్యల గురించి మాట్లాడలేదు. ఆయనొక అసమర్థ మంత్రిగా మిగిలారు. కిరాయి మంత్రిగా పనిచేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎవరిని తిట్టమంటే వారిని తిట్టడానికే ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు. ఆయన సోమిరెడ్డి కాదు. సోమరిరెడ్డి. చివరి సంక్షోభాన్ని కూడా పిండుకోవడానికి సమీక్షలను అవకాశంగా మార్చుకుంటున్నారు. చివరి అవకాశం కాబట్టి సమీక్షల పేరిట చంద్రబాబు సచివాలయానికి వెళ్తున్నారు’అని గోవర్ధన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు.