
బాకు (అజర్‌బైజాన్ ): వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ అర్హత పొందే అవకాశాలకు ఎదురుదెబ్బ తగిలింది. ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్లలో భాగమైన ప్రపంచకప్‌లో దీపా వాల్ట్ విభాగం ఫైనల్లో విఫలమైంది. మోకాలి గాయం తిరగబెట్టడంతో ఆమె ఫైనల్లో నిర్ణీత రెండు అవకాశాలను పూర్తి చేయలేకపోయింది. తొలి అవకాశంలో దీపా 13.133 పాయింట్లు స్కోరు చేసింది. అదే సమయంలో ఆమెకు గాయం కావడంతో రెండో రొటేషన్‌ను ప్రయత్నించలేదు.
ఫలితంగా ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో దీపా చివరి స్థానంతో సరిపెట్టుకుంది. గాయం తీవ్రత దృష్ట్యా వచ్చే వారం దోహాలో జరిగే ప్రపంచకప్ టోర్నీ నుంచి దీపా వైదొలిగింది. ‘ఫైనల్‌కు ముందే దీపా మోకాలి నొప్పితో బాధపడింది. ఫిజియో సాయంతో ఆమె ఫైనల్లో పాల్గొన్నా తొలి ప్రయత్నంలో ఆమె మ్యాట్‌పై సరిగ్గా ల్యాండ్ కాలేదు. దాంతో గాయం తిరగబెట్టింది. గాయం నుంచి కోలుకున్నాక దీపా జూన్‌లో జరిగే ఆసియా చాంపియన్‌షిప్‌లో, అక్టోబర్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటుంది’ అని భారత జిమ్నాస్టిక్స్ సమాఖ్య (జీఎఫ్‌ఐ) ఉపాధ్యక్షుడు రియాజ్ భాటి తెలిపారు.