అక్రమ నిర్మాణాలు, అనధికారిక లే అవుట్‌ల కూల్చివేతలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) వేగిరం చేసింది.
మూడు లే అవుట్‌లను నేలమట్టం చేసిన హెచ్‌ఎండీఏ
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాలు, అనధికారిక లే అవుట్‌ల కూల్చివేతలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) వేగిరం చేసింది. స్పెషల్ డ్రెవ్‌లో భాగంగా ఆరో రోజైన గురువారం నాలుగు ప్రాంతాల్లో ఏకకాలంలో 11 అక్రమ నిర్మాణాలు, మూడు లే అవుట్‌లను పోలీసు సిబ్బంది సహకారంతో హెచ్‌ఎండీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది నేలమట్టం చేసింది. స్థానికుల నుంచి నిరసన వ్యక్తమైనా పుప్పలగూడ, నియమి, బోడుప్పల్, చెంగిచెర్ల, బాలాపూర్ మండలం జల్‌పల్లి ప్రాంతాల్లో అక్రమ భవనాలు, లే అవుట్‌లను కూల్చివేసింది. దుండిగల్‌లోని 20 ఎకరాల స్థలం భూవివాదంలో ఉండటంతో హెచ్‌ఎండీఏ లే అవుట్‌ను తిరస్కరించిన రోడ్డు, ప్రహరీలు, నిర్మాణాలు చేపట్టి తాజాగా ఎల్‌ఆర్‌ఎస్ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న లే అవుట్‌ను కూడా హెచ్‌ఎండీఏ సిబ్బంది కూల్చివేసింది. దొమ్మర పోచంపల్లి నర్సాపూర్ రోడ్డులోని మూడు అంతస్తుల బిల్డింగ్‌ను, జల్‌పల్లిలో అనధికారిక లే అవుట్‌ను నేలమట్టం చేసింది.