
సాక్షి, హైదరాబాద్: భారీ అగ్నిప్రమాదంతో మేల్కాజ్‌గిరి-మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లి ఉలిక్కిపడింది. శుక్రవారం మధ్యాహ్నం పెట్రోల్ ట్యాంకర్‌కు మంటలు అంటుకోవడంతో పెద్ద ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఉవ్వెత్తున మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఆయిల్ ట్యాంకర్‌తో పాటు పలు వాహనాలు దగ్ధమయ్యాయి. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకోవడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది.
వాహనదారుడి నరకయాతన..
ఆయిల్ ట్యాంకర్ నుంచి వ్యాపించిన మంటలు అంటుకుని ద్విచక్ర వాహనదారుడొకరు నరకయాతన అనుభవించారు. తలకు హెల్మెట్‌తో ఒళ్లంతా గాయాలతో అతడు పడిన యాతన హృదయాలను ద్రవింపజేసింది. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలియగానే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు.
ముగ్గురు గాయపడ్డారు: సీపీ
ఆయిల్ ట్యాంకర్ అగ్నిప్రమాదంలో ముగ్గురు గాయపడినట్టు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. మంటలు అదుపులోకి వచ్చాయని, సహాయక చర్యలను ఉప్పల్ ఏసీపీ పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు.