సొంత ప్రాంతంలో ఉపాధి కరువై ప్రతీ సంవత్సరం నారాయణఖేడ్ నియోజకవర్గం ...
దశాబ్దాలుగా తరలుతున్న వలస బాటకు నారాయణఖేడ్ ప్రాంతంలో ప్రస్తుతం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సొంత ప్రాంతంలో ఉపాధి కరువై ప్రతీ సంవత్సరం నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి వలస వెళ్ళడం ఆనవాయితీగా వస్తోంది. దీనికి తోడు ప్రస్తుత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో కరువు విలయతాండవం చేయడంతో వలసలు పెరగనున్నట్లు తెలుస్తోంది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో 175 తండాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఖరీఫ్‌లో వ్యవసాయ పనులు చేసిన గిరిజనులు ప్రస్తుతం పనులను ముగించుకున్నారు.
ఉపాధిహామీ పథకం ఉన్నా ఉపయోగకరంగా లేదంటున్న గిరిజనులు వలసలే శరణ్యమని వలసబాట పడుతున్నారు. నియోజకవర్గంలో 2లక్షలకు పైగా జనాభా ఉంది. ఇందులో దాదాపు10 వేలకు పైగా జనాభా వలస వెళ్ళి ఇతర చోట్ల నివాసం ఉంటున్నారు. కాగా నియోజకవర్గంలోని గిరిజనులు, ఇతరులు కలిపి సుమారు 40వేల మంది వరకు వలస బాట పట్టనున్నట్లు సమాచారం.
చెరకు ఫ్యాక్టరీలకు వలసలు:
ఖేడ్ నియోజకవర్గం నుంచి సుమారు 75 శాతం మంది గిరిజనులు డిసెంబర్ వరకు వలసలకు వెళ్తున్నారు. అప్పటి నుంచి వచ్చే ఏప్రిల్, మే వరకు చక్కెర కర్మాగారాల్లోనే వివిధ కూలీ పనులను చేస్తుంటారు. జిల్లాలోని కొత్తూరు, సంగారెడ్డి, మెదక్, కరీంనగర్, మెట్‌పల్లి, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని మాగి, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల్లోని షుగర్ ఫ్యాక్టరీలకు వెళ్ళి చెరకు నరికే పని చేస్తుంటారు. అల్లీకేడ్, మన్నక్కెళ్ళి తదితర ప్రాంతాలకు వలసవెళ్తారు.
ఉపాధిహామీ పథకంలో 100 రోజులు పని కల్పిస్తామని ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనలు పేరుకే మిగులుతున్నాయని గిరిజన కూలీలు వాపోతున్నారు. కేవలం 30, 40 రోజులు మాత్రమే పనులు కల్పిస్తున్నారని, అందులోనూ కూలీ బిల్లులు తక్కువగా వస్తుండడం, బిల్లుల జాప్యం కారణంగా పథకం సక్రమంగా కొనసాగడం లేదని వారు పేర్కొంటున్నారు. చెరకు నరికేందుకు వెళ్లే కూలీలకు టన్నుకు రూ.400ల నుంచి రూ.500ల వరకు ఇస్తున్నారు.
బీమా లేదు - భద్రత కానరాదు
వలసవెళ్ళిన గిరిజనుల బతుకులకు బీమా లేదు., భద్రత కరువు. వలసవెళ్ళిన ప్రాంతాల్లో గుడారాలు వేసుకొని జీవిస్తున్న వీరు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. చెరకు నరికే క్రమంలో పాముకాట్లకు గురై పలువురు మరణించిన సంఘటనలు ఉన్నాయి. నాలుగేళ్ళక్రితం నిజామాబాద్ జిల్లాలో తిరుగు ప్రయాణంలో చెరకు బండ్లను రైలు ఢీకొన్న ఘటనలో ఓ కుటుంబంలోని ముగ్గురు మరణించారు. పదేళ్ళ క్రితం చాప్టా(కె) పంచాయతీ పరిధిలోని అకలై తండాలో గిరిజనులందరూ వలస పోగా ఇళ్ళవద్ద ఉన్న వృద్ధులు, పిల్లలు అగ్నిప్రమాదంలో చిక్కుకున్నారు. అందులో ఇద్దరు సజీవ దహనం అయ్యారు.
బోసిపోతున్న తండాలు..
నారాయణఖేడ్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద మండలమైన మనూరు మండలంలో వలసల జోరు ఊపందుకుంది. గత వారం రోజులుగా ఏ గ్రామం, తండాలో చూసినా మూటా ముల్లె సర్దుకుంటున్న దృశ్యాలే అగుపిస్తున్నాయి. గ్రామాలు, తండాల్లోని అనేక గడపలు ఇప్పటికే తాళాలు వేసి ముళ్ళ కంచెలు పెట్టి ఉంచిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. మండలం నుంచి కర్ణాటక, మహారాష్ట్రతో పాటు, తెలంగాణలోని నిజామాబాద్, మెదక్, కరీంనగర్ ప్రాంతాల్లో గల చెరకు కర్మాగారాలు ఉన్న చోటకు వందల సంఖ్యలో తరలుతున్నారు.
పెద్దశంకరంపేట, కలేర్ మండలం తదితర తండాల్లోని విద్యార్థులు బడికి దూరమవుతున్నారు. దీంతో తండాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. కంగ్టి మండలంలో మాత్రం ఈ పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. అన్ని గిరిజన తండాల నుంచి కేవలం 40 నుంచి 50 మంది నిరుపేద ప్రజలే వలస వెళుతున్నారు. సర్కార్ సరైన గిట్టుబాటు వేతనంతో స్థానికంగా ఉపాధి పనులు కలిపించి ఈ వలసలకు చెక్ చెప్పాలని ఖేడ్ ప్రాంత ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.