దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే రావణ...
ఆర్మూర్ టౌన్ : దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే రావణ సంహారం(దహనం) దృశ్య రూపకం పట్టణంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. 19 ఏళ్లుగా ఈ ఘట్టాన్ని చూసేందుకు పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తారు.
ఈ దృశ్యరూపకాన్ని సృష్టించి దసరా ఉత్సవాలకు శోభను తీసుకువచ్చి ప్రజలకు కనువిందు చేస్తున్నది పట్టణానికి చెందిన ఎలక్ట్రిక్ బ్రహ్మ బిరుదాంకితుడు చౌకె లింగం. స్థానిక జిరాయత్ నగర్‌లో నివాసముంటున్న చౌకె లింగం దసరా ఉత్సవాల్లో రావణ దహనానికి ఆద్యుడు. జంబి హనుమాన్ ఆలయంలో దసరా ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా అంగరంగవైభవంగా జరిగినప్పటికీ లింగం రాకతో ఉత్సవాలకు మరింత శోభ సంతరించుకుంది. వీధి నాటకాలు, యక్షగానం, బుర్రకథలతో చౌకె లింగం ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితుడు.
జిల్లా వ్యాప్తంగా తొమ్మిది చోట్ల ప్రదర్శన..
ఈ ఏడాది పట్టణంతో పాటు మండలంలోని అంకాపూర్, మిర్ధాపల్లి, నందిపేట్ మండలం వన్నెల్(కె), బాల్కొండ మండలం బోదెపల్లి, వేల్పూర్ మండలం పడిగెల్, ఇందల్‌వాయి మండల కేంద్రం, మోర్తాడ్ మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలో రావణ దహనం ఘట్టాన్ని చౌకె లింగం సౌజన్యంతో నిర్వహించనున్నారు. ఇందుకు ఏర్పాట్లలో చౌకె లింగం బృందం నిమగ్నమయ్యింది. ఈ యేడు దుర్గామాత చేతిలో మహిషాసుర వధను వరుసగా రెండవ సంవత్సరం ప్రదర్శించేందుకు లింగం సన్నద్ధమవుతున్నారు.
నా అదృష్టంగా భావిస్తున్నా
పట్టణంలో దసరా ఉత్సవాల నిర్వహణలో ప్రతి యేట నాకు అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నా ను. గతేడాది నుంచి రావణ సంహారంతో పాటు మహిషాసుర వధను ప్రదర్శిస్తున్నాం. కళాకారులకు, ప్రతిభావంతులకు ఆశించిన మేర గుర్తింపు లభించడం లేదు.
- చౌకె లింగం, రావణ దహనం సృష్టికర్త, ఆర్మూర్