
సాక్షి, హైదరాబాద్: సగటు విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం విద్యుత్ ఉద్యోగుల సమష్టి కృషి వల్లే సాధ్యమైందని ట్రాన్స్‌కో, జెన్‌కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి.ప్రభాకర్‌రావు అన్నారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ (టీఈఈ) 1104 రూపొందించిన పవర్‌మెన్–2019 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం మింట్‌కాంపౌండ్‌లో జరిగింది. దీనికి టీఈఈ 1104 రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.పద్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి సాయిబాబు అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 24 గంటల విద్యుత్‌ను రాష్ట్ర ప్రజలందరికీ అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను యూనియన్ల వారీగా పరిశీలించి బోర్డులో చర్చించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీనిచ్చారు. అలాగే రైతులు, వినియోగదారులు కష్టాలు పడకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించడం శుభపరిణామమని చెప్పారు.
ఏ విభాగంలో లేని జీతాలు: శ్రీనివాస్‌గౌడ్
సీఎం కేసీఆర్, ప్రభాకర్‌రావుల సలహాలు, సూచనలతో తెలంగాణ మొత్తం గర్వపడేలా విద్యుత్ సమస్యను అధిగమించామని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఏ డిపార్టుమెంటులో లేని జీతాలు సీఎం చొరవతో విద్యుత్ ఉద్యోగులు అందుకుంటున్నారని చెప్పారు. అనంతరం టీఈఈ యూనియన్, ఇతర యూనియన్లు రూపొందించిన క్యాలెండర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఎస్‌ఎస్‌పీడీసీల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డి, టీఎస్‌ఎన్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్‌రావు, ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి పాల్గొన్నారు.