అంశాలవారీగా ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న తెలంగాణ జేఏసీ క్షేత్రస్థాయిలో పునాదుల బలోపేతంపై దృష్టి కేంద్రీకరించింది
సాక్షి, హైదరాబాద్: అంశాలవారీగా ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న తెలంగాణ జేఏసీ క్షేత్రస్థాయిలో పునాదుల బలోపేతంపై దృష్టి కేంద్రీకరించింది. రైతు సమస్యలపై ఇప్పటికే నిరాహారదీక్షతో పాటు పలు కార్యక్రమాలను నిర్వహించిన టీజేఏసీ తాజాగా వైద్యరంగంలో లోపాలపై చర్చకు తెరలేపిం ది. యువతకు ఉపాధి, విద్యారంగంపై భవి ష్యత్తులో మరిన్ని కార్యక్రమాలకు రూపకల్ప న చేస్తోంది. చర్చలు, సదస్సులకు మాత్రమే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి ఉద్యమ కార్యాచరణకు సిద్ధం కావాలని నిర్ణయించింది.
దీనికి అనుగుణంగా ఇప్పటికే రాష్ట్రంలోని 31 జిల్లాలకు జేఏసీ నిర్మాణాలపై కసరత్తును పూర్తిచేసింది. రాజధాని స్థాయిలో జరిగే ఉద్యమ కార్యాచరణ, జిల్లా స్థాయిలో జరుగుతున్న చిన్నచిన్న సదస్సులకే పరిమితం కాకుండా పలు చర్యలను తీసుకుంటోంది. మండల స్థాయి దాకా జేఏసీల నిర్మాణాన్ని పూర్తి చేసి, వివిధ ప్రజాసంఘాలు, ఉద్యమకారులను సమీకరించి, బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. జేఏసీ పిలుపు, ఉద్యమ కార్యాచరణ మండల స్థాయిదాకా విస్తరిస్తే రాష్ట్ర ఏర్పాటు ఫలాలను ప్రజలకు అందించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని జేఏసీ భావిస్తోంది.
ప్రత్యామ్నాయ మీడియాపై దృష్టి
తెలంగాణ జేఏసీ అవగాహన, విశ్లేషణ, నిర్ణయాలు, ఉద్యమ కార్యాచరణ వంటివి ప్రజ ల్లోకి తీసుకుపోవడానికి ఉన్న అవకాశాలను జేఏసీ అధ్యయనం చేసింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు మాత్రమే పరిమితం కాకుం డా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. జేఏసీ విశ్లేషణలు, కార్యక్రమాలతో ఒక బులెటిన్ విడుదల చేయాలని నిర్ణయించింది. సామాజిక మాద్యమాలను ప్రారంభించడానికీ ఏర్పాట్లు చేస్తోంది.