సాటివారిని ప్రేమించాలనే ఉద్దేశంతోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున చేపట్టారని వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు.
* తెలుగు ప్రజలకు విజయమ్మ క్రిస్మస్ సందేశం
* వైఎస్సార్ ఆశయాల సాధన కోసం జగన్ తపన
* వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు సాక్షి, హైదరాబాద్: సాటివారిని ప్రేమించాలనే ఉద్దేశంతోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున చేపట్టారని వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. సమాజంలో ఏ ఒక్కరూ పేదరికంతో ఇబ్బందులు పడకూడదని వైఎస్ భావించేవారని, ఆయన పదవిలో ఉన్నంత కాలం అలాగే పనిచేశారన్నారు. ప్రజలకు ఇంకా ఎంతో మేలు చేయాలన్న తపనతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆమె మాట్లాడుతూ వైఎస్ ఆశయాలను జగన్ సాధించి తీరతాడని తనకు పూర్తిగా నమ్మకం ఉందన్నారు. ఆశయ సాధనలో జగన్‌కు అందరి ఆశీస్సులు ఉండాలని ఆమె ఆకాంక్షించారు.
విశ్వవ్యాప్తంగా తెలుగు ప్రజలందరికీ విజయమ్మ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడున్నా అంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఎలాంటి లోటు రాకూడదని, వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. అనంతరం విజయమ్మ క్రిస్మస్ కేక్‌ను కోసి అందరికీ పంచి పెట్టారు. ఫాదర్ జార్జి హెర్బర్ట్ పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకలు ప్రార్థనలు, యువతీ యువకుల నృత్యాలు, దైవగీతాల ఆలాపనలతో సాగాయి. క్రిస్మస్ వేడుకల్లో విజయమ్మతో పాటు పార్టీ ముఖ్యనేతలు డీఏ సోమయాజులు, వాసిరెడ్డి పద్మ, విజయచందర్ వేదికపై ఉన్నారు. విజయసాయిరెడ్డి, పీఎన్వీ ప్రసాద్, గట్టు రామచంద్రరావు, గుడివాడ అమర్‌నాథ్, మేడపాటి వెంకట్, చల్లా మధుసూదన్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, కొండా రాఘవరెడ్డి, డాక్టర్ ప్రపుల్లరెడ్డి, షేక్ సలాంబాబు, సందీప్ వేడుకల్లో పాల్గొన్నారు.
ఇడుపులపాయకు జగన్
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రి కుటుంబసభ్యులతో పాటు ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. పులివెందులలో జరిగే క్రిస్మస్ ఉత్సవాల్లో వారు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.