
రాజ్యాంగాన్ని మరవొద్దు
గర్జన అనంతరం దానికి కొనసాగింపుగా చేయాల్సిన పనులేమీ పన్నీర్ సెల్వం మొదలెట్టలేదు. ప్రజలు కోరుకుంటే రాజీనామాను వెనక్కు తీసుకుంటానని రాజ్యాంగం ప్రకారం అసాధ్యమైన మాటను అన్నారే తప్ప...అధికారానికి అర్రులు చాచే సగటు నేతలా ఎమ్మెల్యేలను సమీకరించే పనికి పూనుకోలేదు.
జల్లికట్టు ఆందోళనతో అట్టుడికి ఈమధ్యే సద్దుమణిగిన తమిళనాడులో ప్రస్తుతం అంతకు మించిన డ్రామా నడుస్తోంది. రకరకాల మలుపులు తీసుకుంటూ ఉత్కంఠ రేపుతోంది. మూఢ నమ్మకాలకూ, సంప్రదాయం పేరిట సాగే తంతులకూ వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర గల ద్రవిడ రాజకీయాల్లో ఇప్పుడు ఆత్మ... అంతరాత్మ వంటి మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం ఊహించని రీతిలో మంగళవారం రాత్రి దివంగత నేత జయలలిత సమాధి వద్ద ధ్యానముద్రలో కూర్చుని సంచలనానికి తెరలేపారు. ఆయన దాన్నుంచి బయటికొచ్చాక ఏం చెబుతారన్న అంశంపై అక్కడికొచ్చిన మీడియా సిబ్బంది కాసేపు అయోమయానికి గురయ్యారంటేనే పన్నీర్ సెల్వం ఎలాంటి వ్యక్తో అర్ధమవుతుంది.
ఆయనలో ముందూ మునుపూ తిరుగుబాటు తత్వం లేకపోవడం, కనీసం పరుషంగా మాట్లాడిన చరిత్ర లేకపోవడం వల్లనే ఈ అయోమయం. జయలలిత జీవించి ఉన్నప్పుడు మాత్రమే కాదు...ఆమె మరణానంతరం సీఎం పదవిలో కొనసాగిన ఈ రెండు నెలల్లో కూడా పన్నీర్ సెల్వం వ్యవహారశైలి ఆ మాదిరే ఉంది. శశికళ మద్దతుదార్లు కోరగానే సీఎం పదవికి రాజీనామా చేయడం, శాసనసభాపక్ష సమావేశంలో ఆమె పేరును తానే ప్రతిపాదించి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించడం వంటివి గమనించినవారికి పన్నీర్ ఇలా తిరగబడతారన్నది ఊహకందని విషయం. అందువల్లే ‘ఆ సమావేశం సంగతే ముందు చెప్పలేదు... చిన్నమ్మ పిలుస్తున్నారంటే వెళ్లాను...అక్కడనన్ను అవమానించారు...నాతో బలవంతంగా రాజీనామా చేయించారు...’ అంటూ ఆయన చెప్పిన మాటలు విని అందరూ విస్తుపోయారు. పైగా అమ్మ (జయలలిత) ఆత్మ ప్రేరణతో ఈ నిజాలు చెబుతున్నానని అన్నారు.
ఎవరో అన్నట్టు గొర్రెపిల్ల ‘గర్జించింది’. అయితే ఆ గర్జన అనంతరం దానికి కొనసాగింపుగా చేయాల్సిన పనులేమీ పన్నీర్ సెల్వం మొదలెట్టలేదు. ప్రజలు కోరుకుంటే రాజీనామాను వెనక్కు తీసుకుంటానని రాజ్యాంగం ప్రకారం అసాధ్యమైన మాటను అన్నారే తప్ప...అధికారానికి అర్రులు చాచే సగటు నేతలా ఎమ్మెల్యేలను సమీకరించే పనికి పూనుకోలేదు. ఇది పన్నీర్ సుగుణం కావొచ్చు. అటు ఏనాడూ ఏ పదవీ చేపట్టిన చరిత్ర లేని శశికళ మాత్రం పన్నీర్ తిరుగుబాటు అనంతరం చకచకా కదిలారు. పార్టీ ఎమ్మెల్యేలను సమీకరించి తరలించారు. ఆ శిబిరం ఎక్కడుందో తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. పార్టీకున్న 134మంది ఎమ్మెల్యేల్లో 131మంది మద్దతు ఉన్నదని ప్రకటించుకున్నారు. గురువారం రాష్ట్రానికొస్తున్న గవర్నర్ విద్యాసాగరరావు ఏం చేస్తారన్న అంశంలో ఎవరికెన్ని ఊహాగానాలున్నా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు తనను సమర్ధించే ఎంపీలను వెళ్లమని ఆమె పురమాయించారు. అవసరమైతే తన ఎమ్మెల్యేలను కూడా ఢిల్లీ తీసుకెళ్లేందుకు సిద్ధపడుతున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో శశికళతో పోలిస్తే ఒక్క పన్నీర్‌సెల్వం మాత్రమే కాదు...గవర్నర్ సైతం తత్తరపడుతున్నారనిపిస్తుంది. సాధారణ సమయాల్లో గవర్నర్ పదవి అందరికీ అలంకారప్రాయంగా కనబడుతుంది. కానీ రాజకీయ సంక్షోభాలు తలెత్తినప్పుడు వారిది కీలకపాత్ర. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా, రాజ్యాంగ ఉల్లంఘనలు జరగకుండా చూడటం...సాధ్యమైనంత త్వరగా సాధారణ స్థితి నెలకొనేలా చూడటం గవర్నర్ కర్తవ్యం. అలా చూస్తే ఆదివారం శశికళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్న సమాచారం అధికారికంగా అందిన వెంటనే విద్యాసాగరరావు కదిలి ఉండాల్సింది. ఆ సమావేశం సక్రమంగా జరిగిందని భావిస్తే శశికళను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించి ఉండాలి. ఆ విషయంలో సంతృప్తి కలగకపోతే పన్నీర్ రాజీనామా ఆమోదించే ముందే తనకున్న సందేహాలను తీర్చుకోవాలి.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకూ శశికళ వేచి చూడాలన్న అభిప్రాయం ఉంటే ఆ సంగతి ఆమెతో చెప్పాలి. అందుకామె అభ్యంతరం చెబితే న్యాయ నిపుణుల సలహా తీసుకుని దాని ప్రకారం నడుచుకోవాలి. కానీ విద్యాసాగరరావు ఇవేమీ చేయలేదు. అసలు రాష్ట్ర నాయకులెవరికీ ఆయన అందుబాటులోకి రాలేదు. కీలక సమయంలో ఇలా వ్యవహరించడం వల్ల ఆయన ఎవరి ఆదేశాల మేరకో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలకూ, ఊహాగానాలకూ తావీయలేదా? సంక్షోభం ఏర్పడకుండా చూడాల్సిన గవర్నర్ జాప్యం చేయడం ద్వారా తానే అలాంటి స్థితికి కారకులయ్యారన్న అభిప్రాయం కలగలేదా? మిగిలినవారి సంగతలా ఉంచి బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామే ఆయనను తప్పుబడుతున్నారు.
మంగళవారం రాత్రి పన్నీర్ ప్రకటన వల్ల కొత్త అంశాలు బయటపడి ఉండొచ్చు. అవన్నీ నిజమే కావొచ్చు కూడా. కానీ ఇవేవీ వర్తమాన స్థితిని మార్చలేవు. రాజ్యాంగపరంగా ప్రస్తుతం శశికళ అన్నా డీఎంకే శాసనసభా పక్ష నేత. ఆమెను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడం, అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవడానికి అవకాశమివ్వడం తప్పనిసరి. పన్నీర్ సెల్వం అంటున్నట్టు ప్రస్తుతం శశికళ శిబిరంలో ఉన్నవారిలో ఆయన మద్దతుదార్లు ఉండొచ్చు. వారి సంఖ్య గణనీయమైనదే కావొచ్చు. అదే నిజమైతే శశికళ బలపరీక్షలో విఫలమై పదవినుంచి తప్పుకోవాల్సి వస్తుంది. సుప్రీంకోర్టు ముందున్న కేసులో వ్యతిరేకంగా తీర్పు వచ్చినా శశికళకు అదే పరిస్థితి ఉత్పన్నమవుతుంది.
తెరవెనక ఏం జరిగిందన్న అంశాలతో సంబంధం లేకుండా రాజ్యాంగం ప్రకారం వ్యవహరించడమే తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి విరుగుడు. అందుకు విరుద్ధంగా శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలన విధించడం వంటి చర్యలకు దిగితే అది ప్రజల తీర్పును వమ్ము చేసినట్టే అవుతుంది. ఎస్‌ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రస్తుత ప్రతిష్టంభనకు ముగింపు పలికితే అది కేంద్ర ప్రభుత్వానికీ, గవర్నర్‌కూ మంచిది. లేనట్టయితే ఒక చెడు సంప్రదాయానికి నాంది పలికారన్న అపవాదు మూటగట్టుకున్నట్టవుతుంది.