ayesha jhulka
-
దివ్యభారతి ఆత్మ వెంటాడిందా? ఏడ్చేసిన నాగార్జున హీరోయిన్!
తక్కువ కాలమే నటించినా, యావద్భారత సినీ ప్రేక్షకులు మరీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఏ మాత్రం మరచిపోలేని కధాయికల్లో నెం1 గా నిలుస్తుంది దివ్యభారతి. చిరంజీవితో రౌడీఅల్లుడు, వెంకటేష్‌తో బొబ్బిలిరాజా, మోహన్‌బాబుతో అసెంబ్లీ రౌడీ వంటి చిత్రాలలో నటించిన దివ్యభారతి అందాన్ని చూసేందుకు తెరకు కళ్లప్పగించిన ప్రేక్షకులెందరో. అటువంటి అందాల నటి, ఎంతో భవిష్యత్తు ఉన్న యువనటి అకస్మాత్తుగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఆ తర్వాత అప్పటి ఆమె సహనటీనటులు ఆమె గురించి అడపాదడపా తలచుకుంటూ ఆవేదన చెందడం చూస్తున్నాం. అదే క్రమంలో తాజాగా అప్పటి దివ్యభారతి సహ నటి, అత్యంత ఆత్మీయ నేస్తం అయిన ఆయేషా ఝుల్కా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దివ్యభారతి గురించి కొన్ని విశేషాలు పంచుకుంది.దివ్యతో తనకున్న బంధం గురించి అయేషా మాట్లాడుతూ, ‘మేము రంగ్ షూటింగ్లో ఉండగా.. ఈ సంఘటన మొత్తం జరిగింది. నేను ఆ చిత్రానికి డబ్బింగ్ చెప్పేటప్పుడు–ఆమె అందులో నా చెల్లెలిగా నటించింది–మేమిద్దరం చాలా సన్నిహితంగా ఉండేవాళ్లం. ఇతర సెట్లలో చేస్తున్నప్పుడు కూడా ఆమె వచ్చి నాతోనే కబుర్లు చెబుతూ ఉండేది’’ అంటూ తమ అనుబంధం గురించి వివరించింది.ఆయేషా జుల్కా దివ్య భారతి 1993లో రొమాంటిక్ చిత్రం రంగ్లో కలిసి నటించారు. ఈ చిత్రంలో కమల్ సదానా, జీతేంద్ర, అమృతా సింగ్, ఖాదర్ ఖాన్ బిందు కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో అయేషా, దివ్య సిస్టర్స్‌గా నటించారు. అయితే సినిమా విడుదలకు ముందే దివ్య కన్నుమూసింది.సినిమా స్క్రీనింగ్ సమయంలో దివ్య తో అనుబంధాన్ని తలచుకుంటూ... ఆ దురదృష్ఖకర సంఘటన తర్వాత తాను చాలా రాత్రులు నిద్రపోలేకపోయానని ఆయేషా గుర్తు చేసుకుంది. ‘‘ మా మధ్య ఫ్రెండ్స్‌ని మించిన బంధం ఉంది, ఆ సంఘటన తర్వాత నేను ఆ చిత్రానికి డబ్బింగ్ చెప్పేటప్పుడు, చేయలేకపోయాను, డబ్బింగ్ చెప్పడానికి బదులు నేను భోరున ఏడ్చాను దాంతో డబ్బింగ్ వాయిదా వేయవలసి వచ్చింది. కాబట్టి అదంతా జరిగింది, ఆపై మేము ఫిల్మ్ సిటీలో ఆ సినిమా ప్రివ్యూ వేసినప్పుడు... దివ్య తెరపై కనిపించిన క్షణంలో, స్క్రీన్ ఒక్కసారిగా పడిపోయినట్టయింది.. దివ్య నా చెంతనే ఉన్నట్టు ఓ ఫీలింగ్...బాధ అనుభవించాను దాంతో ఆ రాత్రి నేను చాలా సేపు నిద్రపోలేకపోయాను’’ అంటూ దివ్యభారతి మరణం తర్వాత కూడా తనతోనే ఉందని ఆమె చెప్పింది. గత 1991లో వచ్చిన కుర్బాన్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన అయేషా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది, ఆమెను లైమ్‌లైట్‌లోకి తీసుకెళ్లింది... అక్షయ్ కుమార్ సరసన ఖిలాడీలో ఆమె నటన ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది, ఆ తర్వాత అమీర్ ఖాన్ సరసన జో జీతా వోహీ సికందర్, మిథున్ చక్రవర్తి సరసన దలాల్ లతో పాటు మరిన్ని విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. మూడు దశాబ్దాల పాటు సాగిన ఆమె కెరీర్లో, 60 చిత్రాలకు పైగా పనిచేసింది. తెలుగులో అక్కినేని నాగార్జున సరసన నేటి సిద్ధార్ధ సినిమాలో ఆమె నటించి తన గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకర్షించింది. ఈ సినిమాలో నాగ్‌తో ఆమె లిప్‌లాక్ కూడా చేయడం విశేషం. -
పెంపుడు కుక్క కోసం కోర్టు మెట్లెక్కిన ప్రముఖ హీరోయిన్
చాలామంది సెలబ్రిటీల దగ్గర పెట్ డాగ్స్ ఉంటాయి. వాటిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటారు. సొంత పిల్లల్లా చూసుకుంటూ ఉంటారు. బాలీవుడ్ నటి ఆయేషా జుల్క దగ్గర కూడా అలానే శునకాలు ఉన్నాయి. అందులో ఓ శునకాన్ని అన్యాయంగా చంపేశారని ఈమె ఏకంగా హైకోర్టు మెట్లెక్కింది. ఇంతకీ అసలేం జరిగింది? ఈ కేసు సంగతేంటి? (ఇదీ చదవండి: హీరోయిన్ దివ్య భారతి చనిపోవడానికి కారణమదే.. హీరో షాకింగ్ కామెంట్స్) హిందీతో పాటు కన్నడ, తెలుగు సినిమాల్లో సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటి ఆయేషా జుల్కా. ఈమె టాలీవుడ్ లోనూ 'నేటి సిద్ధార్థ', 'జై' చిత్రాల్లో నటించింది. ఇకపోతే ఈ నటి.. వీధి కుక్కల్ని సంరక్షిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వాటిని పెంచుకుంటూ ఉంటుంది. అలా రాఖీ అనే శునకాన్ని ఇంటికి తెచ్చుకుంది. అయితే 2020 సెప్టెంబరులో ఇది అనుమానస్పద రీతిలో చనిపోయింది. అయితే దీని చావుకి కారణం తమ కేర్ టేకర్ రామ్ ఆండ్రే అని అతడిపై పోలీస్ కేసు పెట్టింది. దీంతో 2021లో ఛార్జ్ షీట్ నమోదు చేసిన పోలీసులు.. ఆయేషా ఇంట్లో పని చేసే రామ్ ఆండ్రేని అరెస్ట్ చేశారు. కొన్నాళ్ల తర్వాత అతడు బెయిల్ పై బయటకొచ్చేశాడు. అప్పటి నుంచి ఈ కేసు అలానే ఉండిపోయింది. తాజాగా ఈ విషయమై బొంబే హైకోర్టు మెట్లెక్కిన ఆయేషా.. తన సత్వరమే న్యాయం చేయాలని కోరింది. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. (ఇదీ చదవండి: నేను అనుకున్న కలని అతడు నిజం చేశాడు: చిరంజీవి) -
అజ్ఞాతవాసం: ఓసి మనసా... ఈమెక్కడుందో తెలుసా?
ప్రత్యక్షంగా కలిసినప్పటికన్నా... ఊహల్లో మరింత అందంగా, ఆహ్లాదంగా కనపడితే, ఆ అమ్మాయి... ప్రేమికుడి మనసుని ఎప్పటికీ వీడిపోదు. అంత గొప్పగా ఉండే ఊహాసుందరిని వర్ణించాలంటే వేయి పదాలు అక్కర్లేదు. ఆయేషా ఝల్కాని చూపిస్తే చాలు. ఎవరీ ఆయేషాఝుల్కా అనుకుంటున్నారా? అయితే నేటి సిద్ధార్థ సినిమా చూడాలి. ఆ సినిమాలో వనకన్యలా మెరిసి యువ ప్రేక్షకుల ఊహాలోకపు ద్వారాలు ‘తెర’పించిన అమ్మాయిని గుర్తు చేసుకోవాలి. ఓసి మనసా నీకు తెలుసా... అంటూ నాగార్జున కలల్లో తేలిపోయేలా చేసిన ఆయేషా... ఇప్పుడేం చేస్తోంది? ‘పహలా నషా పహలా హువా’ అంటూ అమీర్‌ఖాన్‌ను ఊహాలోకంలో ఊరేగేలా చేసిన ఆయేషా... కహాహై ఆప్? కాశ్మీర్ యాపిల్స్‌కు ప్రసిద్ధి. అలాగే ప్రకృతి అందాలకూ. జన్మతః ఆ ప్రాంతానికే చెందిన ఆయేషాఝుల్కా స్వచ్ఛమైన ప్రకృతి సంపదలా ఉంటుంది. మమతాకులకర్ణి లాంటి మెరుపులు, మాధురీదీక్షిత్ లాంటి సౌందర్యరాశులు తెరనేలుతున్న 1990 ప్రాంతంలో... ఆమె తనదైన ముద్రవేసింది. అప్పట్లో బాలీవుడ్ హీరోయిన్స్‌ను టాలీవుడ్‌కి తేవడంలో ముందున్న హీరోగా పేరొందిన నాగార్జున సరసన ఛాన్స్ దక్కించుకుని నేటి సిద్ధార్థలో నటించింది. నాజూకు అందాలతో అలరించినా, నాగ్‌తో ఫ్రెంచ్కిస్ని సైతం పండించినా ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో తన వన్నెచిన్నెల్ని మరికొంత కాలం తెలుగు ప్రేక్షకులకు పంచలేకపోయింది. ఆ తర్వాత బాలీవుడ్‌కి పరిమితమైంది. సల్మాన్‌ఖాన్, గోవిందా, అక్షయ్‌కుమార్ వంటి టాప్‌స్టార్స్ అందరి సరసన చోటు దక్కించుకున్న ఆయేషా నటించిన ఖుర్బాన్, దలాల్, రంగ్, సూరజ్ వంటి చిత్రాలు హిట్స్‌గా నిలిచాయి. ఇవన్నీ ఒకెత్తయితే... అమీర్‌ఖాన్, పూజాబేడీ తదితరులతో కలిసి చేసిన జో జీతా వ హీ సికిందర్ సినిమాలో అంజలి పాత్ర ఒక్కటీ ఒకెత్తు. ఆ సినిమాలో.. టీనేజ్గాళ్గా చేసిన ఆయేషా... సన్నజాజి తీగలా, సంపంగి మొగ్గలా... లా...లా...లా... అంటూ కుర్రకారుకు అందమైన ఊహలా ఒద్దికగా అమరిపోయింది. అక్కడి నుంచి కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా పలు రకాల పాత్రలు పోషించి మెప్పించింది. దశాబ్దం పాటు కళకళలాడిన ఆయేషా...కెరీర్ బాగా ఉండగానే... సినిమాలకు దశలవారీగా దూరమైంది. 2000 సంవత్సరం తర్వాత తెలుగులో ‘జై’ సినిమాలో చేసిన తల్లి క్యారెక్టర్లాగే హిందీలోనూ అరకొరగా కనిపించిన ఆమె...గత నాలుగేళ్లుగా సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఏమైంది? అక్షయ్‌కుమార్‌తో కొంతకాలం, అర్మాన్కొహ్లితో మరికొంతకాలం తెరబయట అనుబంధాన్ని కొనసాగించిన ఆయేషా... కన్స్ట్రక్షన్ టైకూన్‌గా పేరున్న సమీర్వషిని 2003 లో పెళ్లాడారు. సినిమాలకు పూర్తిగా దూరమయ్యాక నలభెరైండేళ్ల వయసులో...ప్రస్తుతం రంగస్థలంపై అభినయాన్ని పండిస్తున్నారు. పురుష్, ప్రకృతి వంటి ‘ప్లే’లను నిర్మిస్తూ, నటిస్తూ ‘థియేటర్’పై తనదైన ముద్ర వేస్తున్నారు. అనంత పేరుతో ఒక ‘స్పా’ సైతం నిర్వహిస్తున్నారు. అందమైన ప్రయాణం... తన బాలీవుడ్ జర్నీ ఓ అందమైన ప్రయాణమని పేర్కొంటారు టీనేజీ వయసులోనే సినిమారంగంలో కాలుపెట్టిన ఆయేషా. అప్పటికీ ఇప్పటికీ పరిశ్రమ చాలా మారిపోయిందంటున్నారు. తను నటిగా వెలుగుతూ ఉండగానే తప్పుకుందామనుకున్నానని, రిటైర్మెంట్ తర్వాత సినిమా ఆవల ప్రపంచాన్ని ఆనందిద్దామనేదే తన ఉద్దేశ్యమనీ అన్నారు. గత దశాబ్దకాలంగా తాను చేసిన సినిమాలు... కేవలం స్నేహితులైన కొందరు సినీపెద్దలు అడిగితే కాదనలేక చేసినవి మాత్రమేనన్నారు. భర్తకు చెందిన నిర్మాణసంస్థ, యాడిషన్స్ పేరుతో తన స్వంత ఫ్యాషన్ డిజైనింగ్ లైన్, ఇటీవలే గోవాలో కొన్న బొటిక్ రిసార్ట్.. వీటన్నింటితో ఊపిరిసలపనంత బిజీ కావడంతో... తనకు సినిమాలను మిస్ అవుతున్నాననే ఫీలింగ్ లేదంటారు. పూజాబేడీ ఇల్లు తన సెలూన్‌కు ఎదురుగానే ఉందని ఆమెతో సహా అందరు సహనటులతో తన సంబంధాలు ఇంకా సజావుగా కొనసాగుతూనే ఉన్నాయన్నారు. సినిమా కెరీర్‌ను ప్లానింగ్ ప్రకారం నడిపించినట్టు కనిపించని ఆయేషా... విభిన్నరంగాల్లో ఇప్పటికీ విజయవంతమైన వ్యక్తిగానే కొనసాగుతున్నారు. రంగుల లోకమే సర్వస్వం అనుకునే తారలకు ఆమె విభిన్నం. - ఎస్.సత్యబాబు