kbr
-
‘ఉక్కు’ చూపు నీటి వైపు
స్టీల్‌ప్లాంట్‌కు తగ్గిన నీటి సరఫరా కేబీఆర్‌లో తగ్గుతున్న నిల్వలు ఏలేశ్వరంలో పంపింగ్ పునః ప్రారంభం ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్‌కు నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. నెలరోజులు సక్రమంగా నీటి సరఫరా జరగడంతో ఊపిరి పీల్చుకున్న యాజమాన్యం.. రెండు వారాలుగా నీటి సరఫరా తీరు చూసి ఆందోళన చెందుతోంది. స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తి, విస్తరణ, ఉక్కునగరంలో తాగునీరు వంటి అవసరాలకు ప్రతి రోజు సుమారు 35 ఎంజీడీ(మిలియన్ గ్యాలన్స్ పర్డే)లు నీరు అవసరం. జూన్ నెలాఖరు వరకు నీటి ఎద్దడితో స్టీల్‌ప్లాంట్ సతమతమైంది. దీంతో జూన్ నెలాఖరుకు కణితి బ్యాలన్సింగ్ రిజర్వాయర్(కేబీఆర్)లో నీటి నిల్వ స్థాయి గతంలో ఎన్నడూ లేని విధంగా 16 రోజులకు పడిపోయింది. జూలైలో ఏలేశ్వరంలో నీటి మట్టం పెరగడంతో సరాసరి 35 ఎంజీడీలు నీటిని సరఫరా చేసేవారు. జూలైలో వర్షాలు పడడం, సరఫరా పెరగడంతో నీటి నిల్వలు 34 రోజులకు చేరుకుంది. దాంతో అప్పటి వరకు నడుస్తున్న ఏలేశ్వరంలో పంపింగ్ నిలిపివేయగా గోదావరి నుంచి రోజుకు 150 క్యూసెక్కుల నీటిని పంపింగ్ కొనసాగిస్తున్నారు. ఆగస్టు మొదటి వారం నుంచి వ్యవసాయానికి ఎక్కువ నీటిని మళ్లించడంతో ప్లాంట్‌కు నీటి సరఫరా తగ్గిపోయింది. ఈ నెలలో పది రోజుల నుంచి 15 నుంచి 20 ఎంజీడీలకు సరఫరా పడిపోగా.. రెండు రోజులుగా రెండు ఎంజీడీలు నీరు మాత్రమే సరఫరా అవుతుంది. ఈ అంశాన్ని ఉక్కు ఉన్నతాధికారులు విస్కోకు విన్నవించగా.. బుధవారం మధ్యాహ్నం నుంచి ఏలేశ్వరంలో పంపింగ్ ప్రారంభించారు. గురువారానికి మొత్తం తొమ్మిది పంప్‌లు ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో మరో 150 క్యూసెక్కుల నీరు లభ్యమయ్యే అవకాశముంది. అందులోంచి రోజుకు 35 ఎంజీడీలు సరఫరా జరుగుతుందని ఉక్కు ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వర్షా కాలంలో కూడా ఈ పరిస్థితి తలెత్తడంపై స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
కేబీఆర్ పార్కు వాకర్స్‌కు హైకోర్టు ఊరట
హైదరాబాద్: కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) నేషనల్ పార్కు వాకర్స్‌కు హైకోర్టు ఊరటనిచ్చింది. పార్కు ప్రవేశ ఫీజును వృద్ధులకు రూ. 500 నుంచి రూ. 1000కి, ఇతరులకు రూ. 800 నుంచి రూ. 1500కి పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 26 అమలును హైకోర్టు నిలుపుదల చేసింది. ఆ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అటవీశాఖ ముఖ్య కార్యదర్శి, అటవీ ప్రధాన సంరక్షణాధికారి, డీఎఫ్ఓలకు నోటీసు లు జారీ చేసి, పూర్తి వివరాలతో కౌంటర్ల దాఖలుకు ఆదేశాలు జారీ చేశారు. ఫీజు పెంపు జీవోను సవాలు చేస్తూ నేచర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి రాహుల్ సింఘాల్ హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని గురువారం జస్టిస్ రామచంద్రరావు విచారించారు.