ఆస్ట్రేలియా స్పిన్ సలహాదారులుగా
శ్రీరామ్, పనేసర్
సిడ్నీ: తమ భారత పర్యటన కోసం ఆస్ట్రేలియా జట్టు అన్ని విధాలుగా సంసిద్ధమవుతోంది. దీంట్లో భాగంగా భారత ఉప ఖండంపై స్పిన్ విభాగంలో రాణించడంపై ఎక్కువగా దృష్టి పెట్టింది. దీనికోసం భారత మాజీ ఆల్‌రౌండర్ శ్రీధరన్ శ్రీరామ్‌తోపాటు ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్‌లను తమ స్పిన్ సలహాదారులుగా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నియమించుకుంది. ఈనెల 29 నుంచి స్మిత్ సేన దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో ప్రాక్టీస్ ప్రారంభించనుంది. ‘ఆసీస్ జట్టుతో మరోసారి కలిసి పనిచేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. భారత్‌లో పర్యటించడాన్ని విదేశీ జట్లు అత్యంత కష్టంగా భావిస్తుంటాయి. ఈ సవాల్‌ను ఎదుర్కొనేందుకు ఆసీస్‌కు సహకరిస్తాను’ అని భారత్ తరఫున ఎనిమిది వన్డేలు ఆడిన 40 ఏళ్ల శ్రీధరన్ అన్నారు.