Premium rates
-
బీమా ప్రీమియం రేట్ల నోటిఫికేషన్లో జాప్యం
మోటార్ థర్డ్ పార్టీ (టీపీ) ప్రీమియం రేట్ల నోటిఫికేషన్ విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. 2025-26 సంవత్సరానికి సవరించిన మోటార్ థర్డ్ పార్టీ (టీపీ) ప్రీమియం రేట్ల వివరాలు ఇంకా విడుదల కాకపోవడంతో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ), రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మధ్య సంప్రదింపుల తర్వాత సాధారణంగా ఈ రేట్లను ప్రకటిస్తారు.ప్రస్తుతానికి అయితే బీమా సంస్థలు గత ఏడాది రేట్ల ఆధారంగానే ప్రీమియంలను వసూలు చేస్తున్నాయి. త్వరలో వెలువడే సవరించిన రేట్లు ప్రస్తుతం కంటే ఎక్కువగా ఉంటే బీమా సంస్థలు నష్టపోయే ప్రమాదం ఉంది. అదే రేట్లు తక్కువగా ఉంటే వినియోగదారులు నష్టపోయే అవకాశం ఉంది. ఈ అనిశ్చితి మోటార్ ఇన్సూరెన్స్ రంగంలో ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తోందని కొందరు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఇప్పటికే తన సిఫార్సులను పూర్తి చేసిందని, తదుపరి రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాలని ఐఆర్డీఏఐ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. తొలుత ఈ రేట్లను 2025 మార్చి 31 లోపు విడుదల చేయాలని అధికారులు భావించారు. వాటిని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాల్సి ఉంది. కానీ రేట్ల విడుదలలో జాప్యం జరుగుతోంది. అయితే ఈసారి కొన్ని వాహన కేటగిరీలకు 10-15% ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో సేవలు నిలిపివేత.. కారణం..గత ఐదేళ్లలో థర్డ్ పార్టీ ప్రీమియం రేట్లు 2-4% వరకు స్వల్పంగా పెరిగాయి. కానీ బీమా సంస్థలు ఈ ఏడాది గణనీయంగా రేట్లను సవరించనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. పెరుగుతున్న క్లెయిమ్ ఖర్చులు కంపెనీల నష్టాలకు దారితీస్తున్నాయనే అభిప్రాయాలున్నాయి. ఇదిలాఉండగా, రోడ్డు ప్రమాద కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బీమా సంస్థలు ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడం, బాధితుల సామాజిక భద్రతను రక్షించేందుకు కట్టుబడి ఉండాలి. కానీ రేట్ల నిర్ధారణలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో బీమా సంస్థల వైఖరిపట్ల కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
మూగజీవాలకు బీమా కాపరిలో ధీమా
న్యూ ఇండియా, ఓరియంటల్, యునెటైడ్ ఇండియా, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లు జనరల్ ఇన్సూరెన్స్ చేస్తున్నాయి. జీవాల పెంపకందారులు స్వయంగా జీవాలకు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ప్రభుత్వం సబ్సిడీ తో కూడిన రుణాల ద్వారా పంపిణీ చేసిన జీవాలకు ముందే బీమా చేయిస్తుంది. నాలుగు మాసాల నుంచి ఏడేళ్లలోపు జీవాలన్నింటికీ(గొర్రెలు, మేకలు, పొట్టేళ్లు, మేకపోతులు) బీమా చేయవచ్చు. ప్రీమియం రేట్లు పశువైద్యులు నిర్ణయించిన జీవాల విలువపై 3 నుంచి 5 శాతం మొత్తాన్ని ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. దేశవాళీ జీవాలకు 4 శాతం, సంకర జాతి జీవాలకు 5 శాతం, విదేశీ జాతి జీవాలకు 3 శాతం, ప్రభుత్వం సబ్సిడీపై అందించే జీవాలకు 2.75 శాతం ప్రీమియం వసూలు చేస్తారు. జనరల్ ఇన్సూరెన్స్ కాబట్టి ప్రీమియం తిరిగిరాదు. జీవాలు మరణిస్తే పరిహారం అందుతుంది. డిస్కౌంట్ ఆఫర్లు వంద నుంచి పది వేల వరకు జీవాలకు ఇన్సూరెన్స్ చేస్తే ప్రీమియంలో 5 నుంచి 20 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తారు. 50+2 మందను ఇన్సూరెన్స్ చేస్తే ప్రీమియంలో 2.5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. జీవాలు 80 కి.మీ. దాటి మేతకు వెళ్తే ప్రీమియం మొత్తం పెరుగుతుంది. పరిహారం ఎప్పుడు లభిస్తుంది ప్రమాదం వల్ల, వ్యాధులు సోకడం వల్ల, ఆపరేషన్ చేయించిన తర్వాత, దోపిడీ జరిగినప్పుడు, అగ్నిప్రమాదాలు, పిడుగులు, వరదలు, భూకంపాలు, కరువు కాటకాలు, తుఫానులు మొదలగు సందర్భాల్లో జీవాలు మరణిస్తే నష్టపరిహారం లభిస్తోంది. ఈ సందర్భాల్లో వర్తించదు ఇన్సూరెన్స్ చేసిన జీవాలకు యుద్ధం వల్ల నష్టం జరిగినా, అంటువ్యాధులు సోకి మరణించినా, ఉద్దేశపూర్వకంగా వ్యాధికి సరైన చికిత్స, ఆహారం అందించకపోయినా, ఒక జీవం చెవిపొగును మరొక జీవానికి మార్చినా, తెలిసీతెలియని వైద్యం అందించినా.. మరణించిన జీవానికి ఇన్సూరెన్స్ కంపెనీలు నష్టపరిహారం అందించవు. బీమా గడువు పూర్తికావడం, ధ్రువపత్రాలు సరిగ్గా లేకపోవడం, చెవిపొగు లేకపోవడం వంటి సందర్భాల్లోనూ నష్టపరిహారం అందదు. -
టర్మ్ పాలసీ..‘క్లిక్’ చేస్తేనే బెటర్
ప్రీమియం ఎందుకు తక్కువ? ఆరోగ్యంగా ఉండి 30 ఏళ్ల వయసున్న వ్యక్తి కోటి రూపాయలకు ఆన్లైన్లో టర్మ్ పాలసీ తీసుకుంటే ఏడాదికి చెల్లించాల్సిన ప్రీమియం కేవలం రూ.7,000 నుంచి 8,000. అంతే...! అదే సాధారణ టర్మ్ పాలసీ తీసుకుంటే... 30 ఏళ్ల వయసున్న వ్యక్తి ఇదే మొత్తానికి ఏడాదికి రూ.15,000 నుంచి రూ.20,000 వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ టర్మ్‌లో ప్రీమియం రేట్లు తక్కువ ఉండటానికి ప్రధానంగా రెండు కారణాలుంటాయి. మొదటిది దీన్లో మధ్యవర్తి ప్రమేయం ఉండదు. నేరుగా కంపెనీ నుంచే పాలసీ తీసుకోవచ్చు. ఒకవేళ ఏజెంట్ లేదా మరో బీమా బ్రోకర్ ద్వారా పాలసీ తీసుకుంటే వారికి కంపెనీ కమీషన్ చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అవేవీ ఉండవు కనుక ప్రీమియం ధరలు తక్కువగా ఉంటాయి. రెండోది ఆన్లైన్ ద్వారా తీసుకునే వారిలో అత్యధికమంది విద్యాధికులై ఉండటం, వీరికి సంపాదన, ఆరోగ్యం వంటి విషయాలపై ఎక్కువగా అవగాహన ఉంటుందన్న ఆలోచనతో తక్కువ ప్రీమియం రేట్లను కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఏజెంట్ లేకపోయినా సేవలు అలాగే.. చాలామందికి ఏజెంట్ల ద్వారానే బీమా కంపెనీల నుంచి పూర్తి స్థాయి సేవలు లభిస్తాయన్న అపోహ ఉంటుంది. కానీ ఏజెంట్ ఉన్నా లేకపోయినా కంపెనీలు అదే విధమైన సేవలు అందిస్తాయి. చిరునామా మారినా, లేక మరే ఇతర సమస్యలున్నా నేరుగా కంపెనీని ఆన్లైన్ ద్వారా సంప్రదించి సేవలు పొందొచ్చు. చివరికి క్లెయింలు కూడా ఆన్లైన్ ద్వారానే దాఖలు చేసుకోవచ్చు. ఒకవేళ బీమా కంపెనీ సేవలను అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే నేరుగా ఐఆర్డీఏకి ఫిర్యాదు చేయొచ్చు. తక్షణం బీమా మొదలు ఆన్లైన్ ద్వారా బీమా పథకం తీసుకున్న క్షణం నుంచే బీమా రక్షణ మొదలవుతుంది. ఒకవేళ మీ ఆరోగ్యం, వృత్తి, కుటుంబ ఆరోగ్య చరిత్ర ఆధారంగా కొన్ని సందర్భాల్లో అదనపు వైద్య పరీక్షలను బీమా కంపెనీలు కోరతాయి. ఇలా వైద్య పరీక్షలో ఏమైనా విషయాలు బయటపడితే... ఆ మేరకు ప్రీమియం పెంచే అధికారం బీమా కంపెనీలకు ఉంటుంది. ఒకవేళ పెంచిన ప్రీమియం ధరలు నచ్చకపోతే పాలసీని రద్దు చేసుకోవచ్చు. కానీ ఇటువంటి సమయంలో బీమా కంపెనీ వైద్య పరీక్షలకు అయిన వ్యయాన్ని తగ్గించి మిగిలిన ప్రీమియాన్ని వెనక్కి చెల్లిస్తుంది. రెన్యువల్ మర్చిపోవద్దు... ఆన్లైన్ ద్వారా పాలసీ తీసుకోవడం చాలా సులభమే. అయితే ఏటా దాన్ని రెన్యువల్ చేసుకోవటం మరిచిపోకూడదు. ఎందుకంటే ఇక్కడ పాలసీ గడువు తీరిపోతోంది, రెన్యువల్ చేసుకోండి అని గుర్తు చేయడానికి ఏజెంట్లు ఎవరూ ఉండరు. ఒకవేళ పాలసీ కాలపరిమితిలోగా రెన్యువల్ చేసుకోకపోతే... కొత్తగా పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో మీ వయసు ఒక సంవత్సరం పెరుగుతుంది కాబట్టి ఆ మేరకు ప్రీమియం కూడా పెరుగుతుంది. సాధారణంగా ఆన్లైన్ టర్మ్ ప్లాన్స్‌లో కాలపరిమితి తర్వాత రెన్యువల్ చేసుకోవడానికి అదనంగా 15 రోజుల సమయాన్ని కంపెనీలు అందిస్తున్నాయి. కానీ ఇలా గ్రేస్ పీరియడ్ కోసం ఆగకుండా కాలపరిమితిలోగానే రెన్యువల్ అయ్యేలా ఈసీఎస్ విధానాన్ని ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. విషయాలు దాచొద్దు.. ధూమపానం, గుట్కా నమలడం వంటి అలవాట్లున్న వారికి ప్రీమియం ధరలు 25 నుంచి 35 శాతం అధికంగా ఉంటాయి. అయితే ప్రీమియం పెరుగుతుందని ఇలాంటి విషయాలు దాచొద్దు. క్లెయిమ్ సందర్భంలో ఇలాంటివి బయటపడితే క్లెయిమ్‌ను తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆరోగ్యం, ఆహారపు అలవాట్ల గురించి పూర్తి సమాచారాన్ని అందించండి. తీసుకోవటం ఇలా... ఇపుడు దాదాపు ప్రతి బీమా కంపెనీ ఆన్లైన్లో టర్మ్ పాలసీ అందిస్తోంది. ఏ కంపెనీ అయితే ప్రీమియం తక్కువ అవుతుందో తెలుసుకోవాలనుకుంటే పాలసీ రేట్లను పోల్చి చూడటానికి పాలసీబజార్, పాలసీ లిట్మస్, అప్నా పైసా వంటి వెబ్‌సైట్లున్నాయి. వాటిలో చూసిన అనంతరం ప్రీమియం ఏ కంపెనీ తక్కువ వసూలు చేస్తోందో తెలుసుకున్నాక... నేరుగా సదరు కంపెనీ వెబ్సైట్లోకి లాగిన్ కావాలి. అక్కడే టర్మ్ పాలసీని ఎంచుకుని అడిగిన వివరాలు నింపాలి. అయితే ప్రీమియం తక్కువగా ఉంది కదా అని ఏ కంపెనీ పడితే అది ఎంచుకోకూడదన్నది నిపుణుల సూచన. సదరు కంపెనీ క్లెయిమ్‌ల సెటిల్మెంట్ ఎంత శాతం ఉందో చూశాకే దాన్ని ఎంచుకోవటం మంచిదన్నది వారి సలహా. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం