
ఈనెల 22కు బదులు 19నే దక్షిణ అండమాన్ సముద్రంలోకి రుతుపవనాలు ప్రవేశించే చాన్స్
కేరళకూ సకాలంలోనే ఆగమనం.. సానుకూల పరిణామం అంటున్న నిపుణులు
తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి వానలు
రేపటి నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగే అవకాశం
సాక్షి, విశాఖపట్నం/సాక్షి హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది కాస్త ముందుగానే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా దక్షిణ అండమాన్ సముద్రంలోకి ఏటా మే 22న నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. తర్వాత వారం, పది రోజుల్లో కేరళను తాకుతాయి. ఈ ఏడాది నైరుతి మూడు రోజులు ముందే.. మే 19న దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ సోమవారం వెల్లడించింది.
వచ్చే నెల ఒకటి నాటికి కేరళకు!: వచ్చే నెల ఒకటో తేదీలోగా నైరుతి రుతుపవనాలు కేరళకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది సానుకూల పరిణామమని అంటున్నారు. అయితే రుతుపవనాలు కేరళకు సకాలంలో చేరాలంటే అరేబియా సముద్రంలో అనుకూల వాతావరణం ఉండాలి. వాటి ఆగమనానికి ముందు అరేబియా సముద్రంలో అల్పపీడనం గానీ, వాయుగుండం గానీ ఏర్పడకూడదు. అలా ఏర్పడితే నైరుతి రాకను ఆలస్యం చేస్తాయి.
ఇప్పుడున్న పరిస్థితుల మేరకు.. ఈ నెలాఖరులోగా అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కొంత కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. మరికొన్ని రోజులైతే స్పష్టత వస్తుందని అంటున్నారు. నిజానికి గత ఏడాది నైరుతి రుతుపవనాలు మే 19నే దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి. కానీ ప్రతికూల పరిస్థితుల వల్ల ఆలస్యంగా జూన్ 8న కేరళను తాకాయి.
రాష్ట్రంలో రెండు రోజులు వానలు: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశంఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రానికి దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది.