కఠిన చర్యలు తీసుకుంటాం | - | Sakshi
Sakshi News home page

కఠిన చర్యలు తీసుకుంటాం

Published Thu, Apr 17 2025 12:37 AM | Last Updated on Thu, Apr 17 2025 12:37 AM

కఠిన చర్యలు తీసుకుంటాం

కఠిన చర్యలు తీసుకుంటాం

సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం అర్బన్‌, రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వసూళ్ల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. సాధారణంగా భూమి రిజిస్ట్రేషన్‌ జరిగితే.. ఒరిజనల్‌ డాక్యుమెంటు అందుకునేందుకు వారం నుంచి 10 రోజులు పడుతుంది. కానీ రూ.1,000 కొడితే సాయంత్రానికే సిబ్బంది ఇచ్చేస్తున్నారు. డబ్బులివ్వకుంటే ఆలస్యం చేస్తున్నారు. ఈ నెల 8న భూముల రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికి ఇప్పటికీ డాక్యుమెంట్‌ రాకపోవడమే ఇందుకు ఉదాహరణ. సిబ్బంది అక్రమ వ్యవహారంతో సామాన్యులు విసుగెత్తిపోతున్నారు. అన్ని విషయాలు ఆయా సబ్‌ రిజిస్ట్రార్‌లకు తెలిసే జరుగుతున్నట్టు సమాచారం.

నకళ్లకు వంద...

స్థిరాస్తులకు సంబంధించిన నకళ్లు (సర్టిఫైడ్‌ కాపీలు) కావాలంటే రూ.500 చలానా చెల్లించి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో రూ.150 చెల్లిస్తే డాక్యుమెంటు ఇస్తారు. కానీ కొంతమంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది రూ. వంద తీసుకుని.. డాక్యుమెంటు నంబర్‌ ద్వారా వాట్సాప్‌లో పీడీఎఫ్‌ కాపీలు పంపిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి చలానాల రూపంలో అందే ఆదాయం పడిపోతోంది. ఇక.. పక్కాగా ఉన్న డాక్యుమెంటు రిజిస్ట్రేషన్‌కు అయినా సబ్‌ రిజిస్ట్రార్‌కు ముడుపులు చెల్లించాల్సి వస్తోందనే విమర్శలు ఉన్నాయి. లేదంటే ‘కామా లేదు, ఫుల్‌స్టాప్‌ లేదు, దిశలు సరిగా లేవు’ అని కొర్రీలు పెట్టి తిప్పుకుంటున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో అనంతపురం అర్బన్‌, రూరల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్లాలంటేనే సామాన్యులు భయపడుతున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌లు ఏమీ తెలియనట్టే ఉంటూ కిందిస్థాయి సిబ్బంది ద్వారా పిండుకుంటున్నారు.

జీపీఏలు చూసి రిజిస్ట్రేషన్‌..

సామాన్యులకు ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాక రిజిస్ట్రేషన్‌లు చేస్తున్న అనంతపురం రూరల్‌, అర్బన్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు.. ఇటీవల జీపీఏను చూపించినా భారీగా రిజిస్ట్రేషన్‌లు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. శోత్రియం భూములపై రాప్తాడుకు చెందిన కొంతమంది టీడీపీ నాయకులు జీపీఏ (జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ)లు సృష్టించారు. వీటిని అడ్డు పెట్టుకుని సబ్‌ రిజిస్ట్రార్‌లు కోట్లాది రూపాయల విలువ చేసే భూములను ‘పచ్చ’ నేతల సొంతం చేశారు. ఈ క్రమంలో ఆయా భూములు కొన్న వారు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

మరో నాలుగు చోట్లా ఇంతే..

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల తీరు మారడం లేదు. ఎన్ని సంస్కరణలు తెచ్చినా వసూళ్లు మాత్రం ఆగడం లేదు. ఉరవకొండ, కళ్యాణదుర్గం, తాడిపత్రి,రాయదుర్గం కార్యాలయాల్లోనూ పరిస్థితి అధ్వానంగా ఉంది. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌లకు వెళ్లిన వారికి ఆయా కార్యాలయాల సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. ఏసీబీ దాడులు జరిగినా, విజిలెన్స్‌ సోదాలు నిర్వహించినా మూణ్నాళ్ల ముచ్చటే అవుతోంది.

అనంతపురం అర్బన్‌, రూరల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వసూళ్ల పర్వం

ఒకేరోజులో డాక్యుమెంటు

కావాలంటే ఒకరేటు

సర్టిఫైడ్‌ కాపీ వాట్సాప్‌లో పంపేందుకు ఇంకో రేటు..

ఇప్పటికే జీపీఏల ద్వారా రూ. కోట్ల విలువైన భూముల రిజిస్ట్రేషన్‌

అనంతపురం నగరంలోని సిండికేట్‌నగర్‌లో వారం రోజుల క్రితం ఓ వ్యక్తి నాలుగు సెంట్ల స్థలం కొన్నారు. అదే రోజు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి స్థలానికి సంబంధించి డాక్యుమెంటు కావాలని అడిగితే మొదట ససేమిరా అన్నారు. సదరు వ్యక్తి రూ. 2 వేలు ఇచ్చేసరికి సాయంత్రానికే మహిళా సిబ్బంది డాక్యుమెంటు అందించారు.

రాప్తాడు రూరల్‌ పరిధిలో రెండెకరాల వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌కు వచ్చింది. ఇటీవల భూమి కొనుగోలుదారుడు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుకు వెళ్లి డాక్యుమెంటు కావాలని కోరగా మొదట ఎవరూ స్పందించలేదు. తర్వాత కొంతసేపటికే ఆఫీసు సిబ్బంది అతడి దగ్గరికి వెళ్లి రూ.5 వేలు చెల్లిస్తే సాయంత్రానికి ఇస్తామని చెప్పారు. డబ్బు తీసుకుని చెప్పిన టైంకి అందించారు. మచ్చుకు ఇవి రెండు ఉదాహరణలే.. ఇలాంటివి అనంతపురం అర్బన్‌, రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నిత్యం పదుల సంఖ్యలో జరుగుతున్నాయి.

గతంలో మాదిరి డాక్యుమెంట్లు ఎక్కువ రోజులు పట్టడం లేదు. అయినా డబ్బు తీసుకుని ఒక్క రోజులో ఇవ్వడం సరి కాదు. సర్టిఫైడ్‌ కాపీలు వాట్సాప్‌లో పంపడం నేరం. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

–భార్గవ్‌, జిల్లా రిజిస్ట్రేషన్‌ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement