
వడడెబ్బతో విద్యార్థిని మృతి
పెద్దపప్పూరు: వడదెబ్బ ప్రభావంతో ఓ విద్యార్థిని మృతి చెందింది. స్థానికులు తెలిపిన మేరకు... పెద్దపప్పూరు మండలం చాగల్లు గ్రామానికి చెందిన గంగరాజు, కవిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎనిమిదేళ్ల క్రితం అనారోగ్యాన్ని తాళలేక గంగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి కవిత వ్యవసాయ కూలి పనులతో ఇద్దరు కుమార్తెలను పెంచి పోషించుకుంటోంది. ఈ నేపథ్యంలో గురువారం వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం గూడూరు అంకాలమ్మ ఆలయానికి వెళ్లి వచ్చారు. ఎండ వేడిమి కారణంగా ఇంటికి చేరుకోగానే కుమార్తె గౌతమి (10)కి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. జ్వరం వచ్చినట్లు శరీరం మొత్తం కాలిపోతుండడంతో వడదెబ్బకు గురైనట్లుగా నిర్ధారించుకుని బంధువులు వెంటనే తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడి వైద్యులు అనంతపురానికి రెఫర్ చేశారు. పరిస్థితి విషమిస్తుండడంతో సర్వజనాస్పత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజామున అక్కడి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలిక మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, చాగల్లులోని ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న గౌతమి మృతి విషయం తెలియగానే ఉపాధ్యాయులు, ఎంఈఓ ఓబులపతి, తదితరులు విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించి, నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.