
యూటీఎఫ్ నేత నాగేంద్రబాబు మృతి
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా ఉపాధ్యాయ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) నేత, రిటైర్డ్ పీఎస్‌హెచ్‌ఎం సీకే నాగేంద్రబాబు (64) శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఈయన కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో లేవలేని స్థితిలో మంచానికే పరిమితయ్యాడు. మంచంపై ఉంటూనే ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం స్పందించే వారు. సోషల్ మీడియా వేదిక ద్వారా ఆయన స్పందిస్తున్న తీరును చూసిన చాలామంది ఉపాధ్యాయులు...నాగేంద్రబాబు బాగా ఆరోగ్యంగానే ఉన్నాడని భావించేవారు. ఆయన మృతి సమాచారం తెలియగానే ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. కల్మషం లేని వ్యక్తిత్వం, నిజాయతీ, నిస్వార్థ నాయకుడు, నిరాడంబరమైన జీవనం, సంఘం పట్ల ఆయన నిబద్ధత, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఆయన కేటాయించిన సమయం వెలకట్టలేనిదని ఉపాధ్యాయులు గుర్తు చేసుకుంటున్నారు. యూటీఎఫ్ ఉమ్మడి అనంతపురం జిల్లా కార్యదర్శిగా, జిల్లా ఉపాధ్యక్షునిగా కొంతకాలం చేసి, కీలకమైన జిల్లా అధ్యక్షునిగా 5 సార్లు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా 6 సార్లు, రాష్ట్ర కార్యదర్శిగా 5 సార్లు, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా 5 సార్లు ఇలా దాదాపు 30 ఏళ్లపాటు యూటీఎఫ్ కోసం పనిచేశారు. శనివారం యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి జయచంద్రారెడ్డి, ఉమ్మడి జిల్లా నాయకులు లింగమయ్య, గోవిందరాజులు, సుధాకర్, కోటేశ్వరప్ప, రమణయ్య, రామప్ప, సుబ్బరాయుడు, శేఖర్, మహమ్మద్ జిలాన్, శ్రీనివాసులు నాయుడు, నాగరాజు, హెండ్రీ, బీకే నారాయణ తదితరులు నాగేంద్రబాబు భౌతికకాయానికి నివాళులర్పించారు.