
సాక్షి, విజయవాడ: అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన ఏపీ వారిని రక్షించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు కేంద్రంతో సమన్వయం చేస్తున్నారు. అకస్మాత్తుగా అమర్నాథ్‌లో వరదలు రావడంతో వేలాది యాత్రికులు చిక్కుకున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రయాణికుల భద్రతపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీంతో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ రంగంలోకి దిగారు. అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్ష్ కౌశిక్ శ్రీనర్‌కు వెళ్లారు.
అమర్నాథ్‌లో ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని హిమాన్షు కౌశిక్ తెలిపారు. శ్రీనగర్‌లోని టెంపుల్ బోర్డ్ కమాండ్ కంట్రోల్ రూమ్‌తో టచ్‌లో ఉన్నామని ఆయన తెలిపారు. చనిపోయిన వారిలో ఏపీ వారు ఎవరూ లేరని పేర్కొన్నారు. కాగా ఇప్పటి వరకు ఏపీకి చెందిన ఆరుగురి ఆచూకీ తెలియలేదు. వినోద్ అశోక్ (విజయవాడ), గునిసెట్టి సుధ, పార్వతి (రాజమహేంద్రవరం), బి.మధు (తిరుపతి), మేడూరు జాన్సిలక్ష్మి (గుంటూరు), వానపల్లి నాగేంద్ర కుమార్‌లు (విజయనగరం) కనిపించడం లేదని గుర్తించారు.
అమర్నాథ్ యాత్రలో చిక్కుకున్న తెలుగువారి సమాచారం కోసం సంప్రదించాల్సిన నంబర్లు
►ఢిల్లీ ఏపీ భవన్ హెల్ప్ లైన్ నంబర్స్: 011-23384016, 011-23387089
►ఆంధ్ర ప్రదేశ్ హెల్ప్ లైన్ నంబర్: 1902
కాగా అమరానాథ్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జల ప్రళయంలో ఇప్పటి వరకు 16 మంది మృతి చెందగా.. ఇంకా 40 మంది యాత్రికుల ఆచూకీ తెలియరాలేదు. ఇప్పటి వరకు ఆర్మీ బేస్ క్యాంప్‌కు 15 వేల మందిని తరలించారు. అయితే అనుమతిస్తే దర్శనానికి వెళ్తామని కొందరు భక్తులు చెబుతున్నారు.