
రాష్ట్ర ప్రభుత్వం నుంచి వినతి అందుకున్న 5 రోజుల్లో దానిపై తగిన నిర్ణయం వెలువరించాలి. అనుమతి విషయంలో అంతిమ నిర్ణయం ఎన్నికల కమిషన్‌దే. నిర్ణయం తీసుకునే ముందు ఇంటింటికీ రేషన్ పథకం వల్ల పెద్ద సంఖ్యలో పేదలు లబ్ధి పొందుతారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
– హైకోర్టు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ‘ఇంటింటికీ రేషన్’ పథకం పేద ప్రజల కోసం ఉద్దేశించిందని, అందువల్ల ఈ పథకం అమలు జరగాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పథకం ఓ రాజకీయ పార్టీ చేపట్టిన కార్యక్రమం ఎంత మాత్రం కాదని, అది ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమని తెలిపింది. అందువల్ల రాజకీయ నాయకులతో, రాజకీయాలతో సంబంధం లేకుండా ఇంటింటికీ రేషన్ పథకాన్ని అధికారుల ద్వారా అమలు చేసుకోనివ్వడానికి అనుమతి ఇవ్వడంలో తప్పులేదని అభిప్రాయపడింది. ఈ పథకం అమలు ఎందుకు అవసరమో తగిన ఆధారాలతో వివరిస్తూ ఎన్నికల కమిషన్‌ను 48 గంటల్లో ఆశ్రయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్త పథకం కాదు.. జూలైలోనే సీఎం ప్రకటించారు..
ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా> సంచార వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పథకాన్ని ఫిబ్రవరి 1 నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ పథకం అమలును నిలిపేసే దిశగా ఈ నెల 28న ప్రొసీడింగ్స్ జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి అత్యవసరంగా హైకోర్టులో హౌస్ మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ బాగ్చీ తన ఇంటి వద్ద నుంచి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, ఇంటింటికీ రేషన్ పథకం కొత్త పథకం ఎంత మాత్రం కాదని వివరించారు. 2019 జూలైలోనే ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేశారని తెలిపారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని, సంచులను, సంచార వాహనాలను సైతం సమకూర్చుకుందని తెలిపారు. లబ్ధిదారుల జాబితా కూడా సిద్ధమైందని కోర్టుకు నివేదించారు. పార్టీల రహితంగా ఎన్నికలు జరుగుతున్నప్పుడు పార్టీ రంగులపై ఎన్నికల కమిషన్ లేవనెత్తున్న అభ్యంతరాల్లో అర్థం లేదన్నారు. ఎన్నికల నియమావళిలో ఓ పథకంపై పూర్తిగా నిషేధం విధించాలని ఎక్కడా లేదని తెలిపారు.
సంచార వాహనాల రంగులపైనే కమిషన్ అభ్యంతరం
ఈ సమయంలో జస్టిస్ బాగ్చీ జోక్యం చేసుకుంటూ.. ‘ఈ పథకం అమలు కన్నా, ఈ పథకం కోసం ఉపయోగిస్తున్న వాహనాలపైనే ఎన్నికల కమిషన్‌కు అభ్యంతరం ఉన్నట్లు కనిపిస్తోంది. వాహనాలపై అధికార పార్టీ రంగులను పోలిన రంగులు ఉండటంపై ఎన్నికల కమిషన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరణ కోరింది. అంతే తప్ప ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అందువల్ల మీ వాదన విని, తగిన నిర్ణయం తీసుకునేందుకు ఇరుపక్షాలకు కొంత గడువునిస్తాం’ అని తెలిపారు. తర్వాత ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ, ఇంటింటికీ రేషన్ పథకం ఉపయోగాలను, పేదలకు ఆ పథకం అవసరాన్ని ఎన్నికల కమిషన్ పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. అయితే ఈ పథకం అమలు కోసం ఉపయోగిస్తున్న సంచార వాహనాలపై అధికార పార్టీ రంగులను పోలిన రంగులు ఉన్నాయంటూ కమిషన్‌కు అనేక ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. అందువల్ల తుది నిర్ణయం తీసుకునేంత వరకు పథకం అమలును వాయిదా వేయాలని కమిషన్ తెలిపిందన్నారు.
అధికారుల ద్వారా అమలు మేలు..
ప్రవర్తనా నియమావళి నిబంధనలను పరిశీలిస్తే.. కొత్త పథకాలపై, ఇప్పటికే కొనసాగుతున్న పథకాలపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించడాన్ని తప్పుపట్టలేమని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇదే సమయంలో కమిషన్ ఓ పథకంపై నిషేధం విధించేటప్పుడు, ఆ పథకం స్వభావం ఏంటి.. పథకం అమలు ఏ దశలో ఉంది.. పథకం కొనసాగింపు అవసరం ఎంత వరకు ఉంది.. పథకం అమలు లేదా వాయిదా ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం అవుతుందా.. ఇలా పలు అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా ప్రయోజనాల నిమిత్తం అలాంటి పథకాలపై పూర్తి నిషేధం విధించడం కన్నా, ఆ పథకాలను ఎలాంటి రాజకీయ ప్రమేయం, రాజకీయ నేతల ప్రమేయం, అభిమానుల ఉత్సవాలు వంటివి లేకుండా, అధికారుల ద్వారా అమలు చేయించడంపై కమిషన్ నిర్ణయం తీసుకోవడం మేలన్నారు. ఈ పథకం ప్రజల ప్రయోజనార్థం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకమన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదన్నారు.
ప్రభుత్వ ఆందోళనను విస్మరించడానికి వీల్లేదు..
‘ఆహార హక్కు, పౌష్టికాహార హక్కును ఈ దేశంలో ప్రతీ పౌరునికి రాజ్యాంగం ప్రసాదించింది. ఇదే సమయంలో ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా, నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన బాధ్యతను కూడా ఎన్నికల కమిషన్‌కు రాజ్యాంగం కట్టబెట్టింది. ఈ రెండింటి మధ్య సమతుల్యం ఎలా చేయాలన్నది ఎన్నికల కమిషన్ మొదటగా నిర్ణయం తీసుకోవాలి. కమిషన్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే, ఇంటింటికీ రేషన్ పథకం అమలును నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని పరిధి దాటి తీసుకున్న నిర్ణయంగా, పక్షపాత నిర్ణయంగా, దురుద్దేశపూరిత నిర్ణయంగా చెప్పలేం.
అయితే కమిషన్ నిర్ణయం వల్ల నిత్యావసరాలను ఆకలితో అలమటిస్తున్న వారికి అందచేయకపోవడంపై ప్రభుత్వం వ్యక్తం చేస్తున్న ఆందోళనను ఎంత మాత్రం విస్మరించడానికి వీల్లేదు’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి పొందడానికి ఈ పథకాన్ని తీసుకురాలేదన్న అడ్వొకేట్ జనరల్ వాదనను న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియకు ఎన్నికల కమిషన్ రథసారథి అవుతుందని, ప్రస్తుతం అమలవుతున్న పథకాలు, కొత్త çపథకాల అమలుతో సహా ప్రతీ ప్రభుత్వ చర్యను పర్యవేక్షించవచ్చని జస్టిస్ బాగ్చీ తెలిపారు. ఆ పథకాలు రాజకీయ లబ్ధి కోసం కాకుండా పేదల ప్రయోజనం కోసం అమలయ్యేలా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయవచ్చన్నారు.