
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, గంగా పశ్చిమ బెంగాల్ తీరాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్ఫిరిక్ స్థాయిల వరకు విస్తరించి నైరుతి వైపు వంగి ఉంది. ఇది రెండురోజుల్లో జార్ఖండ్ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా పయనించనుంది.
మరోవైపు సగటు సముద్రమట్టం వద్ద రుతుపవన ద్రోణి అల్పపీడన ప్రాంతం కేంద్రం.. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌కు ఆనుకుని ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తాంధ్రలో పలుచోట్ల, దక్షిణ కోస్తాంధ్రలో కొన్ని చోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, సోమవారం ఉత్తర కోస్తాంధ్రలో ఒకటిరెండు ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
మంగళవారం కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులు కూడా సంభవించవచ్చని తెలిపింది. మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో ఈనెల 18న ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది ఆ మరుసటి రోజుకి అదే ప్రాంతంలో అల్పపీడనంగా మారనుంది. తరువాత ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. అనంతరం రెండురోజుల్లో ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా మధ్య భారతదేశం వైపు వెళ్లనుంది.
ఫలితంగా రుతుపవన ద్రోణి చురుకుదనం సంతరించుకోనుంది. దీంతో ఈనెల 18 నుంచి నాలుగు రోజుల పాటు రాయలసీమ మినహా రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ప్రధానంగా ఉత్తర కోస్తాంధ్రలో పలుచోట్ల, దక్షిణ కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రాయలసీమలో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీవర్షాలకు ఆస్కారం ఉంది.