
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో), మిశ్ర ధాతు నిగమ్ (మిధానీ)లు సంయుక్తంగా రాష్ట్రంలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రెండేళ్లలోగా పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈ పరిశ్రమకు మౌలిక సదుపాయాల కల్పనలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నాల్కో, మిధానీల సంయుక్త సంస్థ ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ అత్యాధునిక అల్యూమినియం అల్లాయ్ ఉత్పత్తుల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. రూ.5,500 కోట్ల భారీ పెట్టుబడితో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెంలో ఇది ఏర్పాటవుతోంది. దీని వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం 60 వేల మెట్రిక్ టన్నులు. దీని ద్వారా దాదాపు 1000 మందికి ఉపాధి లభిస్తుంది.
నాల్కో సీఎండీ శ్రీధర్ పాత్ర, మిధానీ సీఎండీ సంజయ్ కుమార్ ఝా సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. ప్రాజెక్టు గురించి సమగ్రంగా వివరించారు. ప్రాజెక్టు మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. సదుపాయాల కల్పనలో ఎదురవుతున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే స్పందించిన సీఎం.. మౌలిక సదుపాయాలపై తగిన చర్యలు తీసుకోవాలని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రక్షణ అనుబంధ రంగాల పరికరాల తయారీదారుల అవసరాలు తీర్చడానికి ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా ఎంఎస్‌ఎంఈ పార్క్‌ను కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ సూచించగా అందుకు సీఎండీలు అంగీకరించారు. ఈ సమావేశంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జేవీఎన్ సుబ్రహ్మణ్యం, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన గుమ్మళ్ళ, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.