
సాక్షి,విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమలో శని,ఆదివారాల్లో(సెప్టెంబర్7,8) విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. రుతుపవన ద్రోణి ప్రభావంతో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నట్లు తెలిపింది.
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తీరంలో మత్స్యకారులకు మరో రెండు రోజులపాటు హెచ్చరికలు అమలులో ఉండనున్నాయి. కాగా, వాయుగుండం ప్రభావంతో ఏపీలో ఇటీవల కురిసిన వర్షాలకు విజయవాడ నగరంలో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్న తరుణంలో వాతావరణ శాఖ రాష్ట్రానికి మరోసారి భారీ వర్షసూచన చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.