
సాక్షి, కాకినాడ: అమలాపురంలో జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గు పడేలా ఉందని ఏపీ బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ అన్నారు. 35 మంది పోలీసులకు గాయాలయ్యాయని తెలిపారు. అమలాపురం ఘటనను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ మాటలు వింటే అంబేద్కర్ జిల్లాకు వ్యతిరేకమని అర్దం అవుతుందని, అంబేద్కర్ పేరు పెట్టడానికి పవన్ అనుకూలమా? వ్యతిరేకమా చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ప్రతిపక్షాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని, ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని విమర్శించారు.
ఈ మేరకు మంత్రి వేణుగోపాల్ కాకినాడలో బుధవారం మాట్లాడుతూ.. చంద్రబాబు స్క్రిప్ట్‌ను పవన్ చదివినట్లు కనిపిస్తోందన్నారు. ఉద్యమం ముసుగులో వచ్చిన ఎవరిని విడిచిపెట్టమని తెలిపారు. వినతులు స్వీకరణ కోసం 30 రోజుల సమయం ప్రభుత్వం ఇచ్చిందని, జిల్లా మార్పుపై అభ్యంతరాలు ఉంటే తెలియజేసే పద్ధతి ఇదేనా అని నిలదీశారు. కోనసీమ అల్లర్ల సమయంలో ప్రభుత్వం, పోలీసులు ఎంతో సహనాన్ని వహించారన్నారు. కోనసీమ వాసులందరూ సంయమనం పాటించాలని కోరారు. రాజకీయ వికృత కీడకు యువకులు బలికావొద్దని మంత్రి కోరారు.
చదవండి: ఎమ్మెల్సీ అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైఎస్సార్‌సీపీ