
సాక్షి, అమరావతి: గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో తొలివిడత ఎన్నికలు జరిగే చోట్ల ఏకగ్రీవమైన పంచాయతీలను తాను అనుమతి ఇచ్చేవరకు అధికారికంగా ప్రకటించవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఆయన కార్యాలయం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. రెండు జిల్లాల కలెక్టర్లు పంపే వివరణాత్మక నివేదికలను పరిశీలించిన తర్వాత ఏకగ్రీవమైన పంచాయతీలను ప్రకటించడంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఎస్‌ఈసీ పేర్కొన్నారు. అయితే తొలిదశలో ఎన్నికలు జరిగే పంచాయతీలకు నామినేషన్ల దాఖలు గడువు ముగిసిన మర్నాడు కమిషన్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడటం గమనార్హం.
నివేదికలను పరిశీలించాక నిర్ణయం
‘రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్వేచ్ఛాయుతమైన ఎన్నికలకు అనుకూల వాతావరణం ఉంది. బలవంతపు ఏకగ్రీవాలు రాష్ట్రంలో జరుగుతున్నట్లు కనిపించడం లేదు. అయితే రాష్ట్రం మొత్తం కనబడుతున్న పరిస్థితికి భిన్నంగా గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో ఏకగ్రీవాలు జరిగినట్లు కనిపిస్తోంది. వీటిపై ఆయా జిల్లా కలెక్టర్లను నివేదిక కోరా. వాటిని పరిశీలించాక కమిషన్ తదుపరి చర్యలు తీసుకుంటుంది. ఆయా నివేదికల ప్రకారం ఈ విషయంలో ఏవైనా వైఫల్యాలను గుర్తిస్తే అందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ భావిస్తుంది’ అని నిమ్మగడ్డ ప్రకటనలో పేర్కొన్నారు.
డిక్లరేషన్ ఫారాలు కూడా అందుకున్న ఏకగ్రీవ అభ్యర్థులు!
గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో 70 నుంచి 80 శాతం మంది అభ్యర్థులు గురువారమే ధ్రువీకరణ పత్రాలు కూడా పొందినట్లు తెలిసింది. తొలివిడతలో ఎన్నికలు జరిగే 3,249 పంచాయతీలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆ సమయానికి ఒకే అభ్యర్ధి పోటీలో ఉంటే సంబంధిత రిటరి్నంగ్ అధికారి (ఆర్వో) ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రకటించి ఏకగ్రీవంగా గెలిచిన అభ్యర్థికి ధ్రువీకరణ పత్రాన్ని కూడా వెంటనే అందజేయాల్సి ఉంటుంది. చిత్తూరు జిల్లాలో 454 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 112 చోట్ల సర్పంచి పదవులు, 2,637 వార్డు సభ్యుల పదవులు ఏకగ్రీవం అయ్యాయి. గుంటూరు జిల్లాలో 337 గ్రామ పంచాయతీలకుగానూ 67 సర్పంచి పదవులు, 1,337 వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత ఏకగ్రీవ అభ్యర్ధులు రిటర్నింగ్ అధికారుల నుంచి గెలుపు ధ్రువీకరణ పత్రాలను అందుకున్నట్లు తెలిసింది. రిటర్నింగ్ అధికారి ఒకసారి ఎవరైనా అభ్యర్ధి గెలిచినట్లు అధికారికంగా ధ్రువీకరణ ప్రతం అందజేస్తే ఎన్నికల ప్రక్రియ ముగిసినట్లేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఏకగ్రీవాలపై కమిషన్‌కు కలెక్టర్ల నివేదికలు
గుంటూరు జిల్లాలో 67 సర్పంచి పదవులు, చిత్తూరు జిల్లాలో 112 సర్పంచి పదవులకు ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిసినట్లు ఆయా జిల్లా కలెక్టర్లు శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం అత్యధిక స్థానాల్లో గురువారమే రిటర్నింగ్ అధికారులు గెలుపు ధ్రువీకరణ పత్రాలు అందచేశారని కమిషన్‌కు తెలియచేసినట్లు సమాచారం.
తొలివిడతలో 2,724 గ్రామాల్లో 9న ఎన్నిక
తొలివిడతలో విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాలలో 3,249 గ్రామ పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా 525 గ్రామాల్లో సర్పంచి ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2,724 గ్రామ పంచాయతీల్లో ఈనెల 9వతేదీన పోలింగ్ జరగనుంది. ఉదయం 6.30 గంటల నుంచి 3.30 వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు.