
సాక్షి, విజయవాడ : స్వచ్ఛ సర్వేక్షణ్-2020లో విజయవాడ నగరానికి నాలుగో ర్యాంకు రావడం సంతోషంగా ఉందని నగర మున్సిపల్ కమిషర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకంతో పాటు, విజయవాడ ప్రజల సహకారం వల్లే 4వ ర్యాంక్ సాధించగలిగామని తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుగుణంగా శానిటైజేషన్‌లో చేసిన మార్పులే ఈ అవార్డు రావడానికి కారణమయ్యాయని చెప్పారు. కరోనా ఉన్నప్పటికీ తమ సిబ్బంది ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారని పేర్కొన్నారు.
విజయవాడ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చామన్నారు. ప్లాస్టిక్ బ్యాన్ చేయడానికి చేపట్టిన పద్దతులు కూడా సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ సహకారంతో నగరంలో అందమైన పార్కులు తయారు చేయబోతున్నామని తెలిపారు. అలాగే విజయవాడను చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దామన్నారు. అన్ని బహిరంగ ప్రదేశాల్లో చెత్తబుట్టలు ఏర్పాటు చేశామని చెప్పారు. వచ్చే ఏడాది ర్యాంకుల్లో విజయవాడ నగరాన్ని మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేస్తామని ప్రసన్నవెంకటేష్ పేర్కొన్నారు. (చదవండి : స్వచ్ఛ సర్వేక్షణ్: నాలుగో స్థానంలో విజయవాడ)
కాగా, స్వచ్ఛ సర్వేక్షణ్-2020 జాబితాను కేంద్రం గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఈ జాబితాలో మరోసారి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రథమ స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో సూరత్, మూడో స్థానంలో ముంబై నిలిచాయి. మొదటి పది స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలు కూడా చోటు దక్కించుకున్నాయి.