
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: అర్చకులకు వంశపారంపర్య హక్కులు కల్పించేందుకు ఏపీ కేబినెట్ తీర్మానంపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. అర్చకుల వంశపారంపర్య హక్కులపై ఏపీ కేబినెట్ తీర్మానం ఆమోదయోగ్యంగా ఉందన్నారు.
అసెంబ్లీలో చట్టబద్దంగా నిర్ణయం తీసుకునేందుకు ఏపీ కేబినెట్ తీర్మానం చాలా అవసరం అన్నారు. అర్చక కుటుంబాల దశాబ్దాల కల నెరవేర్ఛడానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు. అర్చక వృత్తికి బ్రాహ్మణులు దూరమవుతున్న సమయంలో ఇది హర్షించదగ్గ పరిణామంగా స్వరూపానందేంద్ర పేర్కొన్నారు.
ఇక ఓపికున్నంత వరకు అర్చకత్వం
దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు ఓపిక, శక్తి ఉన్నంత వరకు భగవంతుడి సేవలో కొనసాగేలా ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చట్ట సవరణ చేసేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే దేవదాయ శాఖ ఉద్యోగులకు కూడా ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు నిర్ణయించింది.
సీఎం జగన్‌కు ఏపీ అర్చక సమాఖ్య కృతజ్ఞతలు
దేవదాయ శాఖ పరిధిలో పనిచేసే అర్చకులకు పదవీ విరమణ లేకుండా వీలైనంత కాలం పనిచేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ఏపీ అర్చక సమాఖ్య సీఎం జగన్‌కు బుధవారం కృతజ్ఞతలు తెలిపింది. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు జగన్ అంటూ అర్చక సమాఖ్య అధ్యక్షుడు అగ్నిహోత్రం ఆత్రేయ బాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబు, ప్రధాన కార్యదర్శి పి.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణకూ ధన్యవాదాలు తెలిపారు.
చదవండి: ఎగిరి గంతేసిన టీడీపీ.. తీరా చూస్తే.. అసలు గుట్టు తెలిసిందిలే..