
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఆహ్వానించినందుకు తైపీ ఎకనమిక్ అండ్ కల్చరల్ సెంటర్(టీఈసీసీ) డైరెక్టర్ జనరల్ బెన్ వాంగ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తైవాన్ పర్యటనకు రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. కాగా ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో తైవాన్‌కు చెందిన వివిధ కంపెనీలతో మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం టీఈసీసీ డైరెక్టర్ జనరల్ బెన్ వాంగ్‌తో పాటు ఆ దేశానికి చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. (చదవండి: తప్పుడు ప్రచారంపై టీడీపీ నేతలు ఇప్పుడేం చెప్తారు..?)
ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తైవాన్‌కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇక సీఎం జగన్ హామీపై హర్షం వ్యక్తం చేసిన బెన్ వాంగ్, తైవాన్ ప్రతినిధులు... రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశమున్న వివిధ రంగాలు, పరిశ్రమల వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ మాథ్యూ చిన్, ఇండియా ఫాక్స్‌లింక్ డైరెక్టర్ ఎరిక్ ని, అపాచీ పుట్‌వేర్‌కు చెందిన గవిన్ ఛాంగ్, పీఎస్‌ఏ వాల్సిన్ ప్రాజెక్టు మేనేజర్ నిరంజన్ ప్రకాష్‌తో పాటు పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, ఆ శాఖ డైరెక్టర్ జె.సుబ్రమణ్యం తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.