
రామయ్య కల్యాణం.. కమనీయం
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పార్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన పూజలు జరిపారు. పూజా కార్యక్రమంలో అర్చకులు, వేదపడింతులు, భక్తులు పాల్గొన్నారు.
రేపు రుద్రహోమం
మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శనివారం రుద్రహోమ పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. యాగశాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు వరకు హోమం జరుగుతుందని పేర్కొన్నారు. పాల్గొనే భక్తులు రూ.1,516 చెల్లించి గోత్రనామాలను నమోదు చేసుకోవాలని, వివరాలకు 63034 08458 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
వైద్యుల పోస్టులకు
దరఖాస్తుల ఆహ్వానం
కొత్తగూడెంఅర్బన్: జిల్లా పరిధిలోని ఆస్పత్రులు, ప్రాంతీయ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిలో పని చేసేందుకు వైద్యుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రవిబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అశ్వారావుపేట, మణుగూరు ఆస్పత్రుల్లో జనరల్ సర్జన్ వైద్య నిపుణులు, ఇతర ఆస్పత్రులలో డెర్మటాలజిస్టులు, భద్రాచలం, బూర్గంపాడులలో ఎంబీబీఎస్ వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే నెల 5వ తేదీ లోగా తమ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు.
పలువురు సీఐల బదిలీ
కొత్తగూడెంటౌన్: జిల్లాలోని పలువురు సీఐలను బదిలీలు చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. కొత్తగూడెం డీసీఆర్బీలో విధులు నిర్వర్తిస్తున్న సీఐ మడిపెల్లి నాగరాజును భద్రాచలం టౌన్ ఎస్‌హెచ్‌ఓగా, కొత్తగూడెం సీసీఎస్ విభాగంలో పనిచేస్తున్న పింగిలి నాగరాజును అశ్వారావుపేట సర్కిల్‌కు బదిలీ చేశారు. తాటిపాముల కరుణాకర్‌ను అశ్వారావుపేట నుంచి బదిలీ చేస్తూ హైదరాబాద్ మల్టీజోన్–1 ఐజీపీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
భద్రాచలంలో..
భద్రాచలంఅర్బన్: ఈ నెల 10న భద్రాచలం సీఐ బర్పాటి రమేష్ ఏసీబీకి పట్టుబడి సస్పెన్షన్‌కు గురయ్యారు. దీంతో దీంతో 15 రోజుల నుంచి అక్కడ సీఐ పోస్టు ఖాళీగా ఉండగా, ఆ స్థానంలో నాగరాజును నియమించారు. నేడు ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.