
విమానయాన సంస్థ ఎయిరిండియా మరో 100 ఎయిర్‌బస్ విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. వీటిలో వైడ్–బాడీ ఏ350 రకం ఎయిర్‌క్రాఫ్ట్‌లు 10, ప్రాంతీయ రూట్లలో ఉపయోగించే నారో–బాడీ ఎ320 రకం విమానాలు 90 ఉన్నాయి. కంపెనీ ఇప్పటికే ఎయిర్‌బస్, బోయింగ్ సంస్థలకు ఇచ్చిన 470 విమానాలకు ఇవి అదనం.
అలాగే ఎ350 ఎయిర్‌క్రాఫ్ట్‌ల విడిభాగాలు, నిర్వహణ సహకారం కోసం ఎయిర్‌బస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎయిరిండియా తెలిపింది. తాజా ఆర్డరుతో కలిపి ఎయిర్‌బస్ నుంచి ఎయిరిండియా కొనుగోలు చేసే మొత్తం ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్య 350కి చేరుతుంది. 2023లో కంపెనీ 250 విమానాల కోసం ఆర్డరిచ్చింది.
"భారత ప్రయాణికుల వృద్ధి ప్రపంచంలోని ఇతర దేశాలను అధిగమించడం, గణనీయంగా మెరుగుపడుతున్న దేశ మౌలిక సదుపాయాలు, ఆకాంక్షతో కూడిన యువ జనాభా అంతర్జాతీయంగా ఎదుగుతుండటం వంటి పరిణామాలతో ఎయిర్ ఇండియా విస్తరణకు స్పష్టమైన సందర్భాన్ని చూస్తున్నాం" టాటా సన్స్, ఎయిర్ ఇండియా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు.