
ముంబై: వినియోగదారు ఆధారిత ప్రాధాన్య విధానాన్ని అనుసరించాలని బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలకు ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ జే స్వామినాథన్ సూచించారు. తద్వారా బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని బలోపేతం చేయవచ్చన్నారు. బ్యాంకుల కస్టమర్ సరీ్వస్ ఇన్‌చార్జ్‌లు, ఎండీ, ఈడీ తదితర ఉన్నతాధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు.
కస్టమర్ల ఫిర్యాదులను కచి్చతంగా పరిష్కరించడం, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని క్రమబదీ్ధకరించడం, కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు, మోసాల నివారణ, నష్టాలను తగ్గించుకునేందుకు టెక్నాలజీని వినియోగించుకోవడంపై సమావేశంలో చర్చ జరిగినట్టు ఆర్‌బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్థిక వ్యవస్థ పట్ల నమ్మకం, విశ్వాసాన్ని పెంచడంతో కస్టమర్ సేవలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా స్వామినాథన్ పేర్కొన్నారు. కస్టమర్ సేవలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఫిర్యాదులకు అసలు మూల కారణాలు, స్వీకరించిన అధికారే నేరుగా పరిష్కరించడం తదితర ఐదు అంశాలపై దృష్టి పెట్టాలని కోరారు.