
సెబీ బోర్డు సభ్యులు, అధికారుల ఆస్తులు, అప్పుల వివరాలు తెలియజేసేలా సమగ్ర నిబంధనలపై సమీక్ష నిర్వహించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని సెబీ యోచిస్తోంది. ఇటీవల సెబీ కొత్త ఛైర్మన్ తుహిన్ కాంత పాండే ఈమేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అదానీ గ్రూప్ వ్యవహారంలో సెబీ మాజీ ఛైర్‌పర్సన్ మాధవిపురి బచ్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అధికారుల లావాదేవీల్లో పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు.
సెబీ ప్రతిపాదిత నిర్ణయంలో భాగంగా అధికారులు, సభ్యులు, ఇతర సిబ్బంది ఆస్తులు, అప్పులు, పెట్టుబడులకు సంబంధించి వివరాల వెల్లడి, పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధనలపై కమిటీ సమీక్ష నిర్వహించనుంది. సెబీపై మరింతగా విశ్వాసం పెంపొందించాలంటే ఈ నిబంధనలను సమీక్షించాలని పాండే తెలిపారు. బోర్డు సభ్యులు, అధికారుల నైతిక ప్రవర్తన, జవాబుదారీతనం, పారదర్శకతను నెలకొల్పాలన్నదే ఈ కమిటీ ఉద్దేశమని స్పష్టం చేశారు.
ఏడాది చార్జీని ముందే తీసుకోవచ్చు
పెట్టుబడుల సలహాదారులు (ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్లు), పరిశోధన విశ్లేషకులు (రీసెర్చ్ అనలిస్టులు) తమ సేవలకు సంబంధించి ఏడాది కాల చార్జీని ముందుగానే క్లయింట్ల నుంచి తీసుకునేందుకు అనుమతించాలని సెబీ నిర్ణయించింది. ప్రస్తుత నిబంధనల మేరకు ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్లు క్లయింట్ల ఆమోదం మేరకు రెండు త్రైమాసికాల చార్జీలనే (ఆరు నెలలు) ముందస్తుగా తీసుకునేందుకు అనుమతి ఉంది. అదే, రీసెర్చ్ అనలిస్టులు అయితే ఒక త్రైమాసికం చార్జీలనే ముందుగా తీసుకోవచ్చు.
ఇదీ చదవండి: బంగారు ఆభరణాలు అమ్మితే పన్ను చెల్లించాలా?
‘ఐఏలు, ఆర్‌ఏలు వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో.. క్లయింట్లు సమ్మతిస్తే ఏడాది కాల ఫీజులను ముందుగానే తీసుకునేందుకు అనుమతించాలని బోర్డు నిర్ణయించింది’ అని సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. ఫీజుల పరిమితులు, చెల్లింపుల విధానాలు, రిఫండ్‌లు, బ్రేకేజ్ ఫీజులకు సంబంధించి నిబంధనల అమలు కేవలం వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాల (హెచ్‌యూఎఫ్) క్లయింట్లకే పరిమితమని స్పష్టం చేశారు.