
ఎన్‌ఎస్‌ఈ ఐపీవోపై తుహిన్ పాండే
ముంబై: ప్రజా ప్రయోజనాలను వాణిజ్య ప్రాధాన్యతలు అధిగమించేందుకు అనుమతించబోమని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే స్పష్టం చేశారు. స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్‌ఎస్‌ఈ) పబ్లిక్ ఇష్యూ ప్రణాళికలపై పాండే తాజాగా స్పందించారు. ఈ అంశాన్ని నియంత్రణ సంస్థలు బలపరచవలసి ఉన్నట్లు సీఐఐ నిర్వహించిన కార్పొరేట్ పాలన సదస్సులో తెలియజేశారు.
వాణిజ్య లేదా లాభార్జన సంస్థలు ఎక్సే్ఛంజీలుగా ఆవిర్భవించేందుకు భారత్ అనుమతిస్తుందని, అయితే నియంత్రణ సంస్థలు మాత్రం సాధారణ ప్రజల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తాయని వివరించారు. ఈ అంశంలో సర్దుబాట్లకు అవకాశంలేదని వ్యాఖ్యానించారు. ఇదేవిధంగా స్టాక్ ఎక్సే్ఛంజీల మధ్య ఘర్షణలు తలెత్తితే పరిష్కరించడం సెబీ బాధ్యతగా పేర్కొన్నారు. కాగా.. ఎనిమిదేళ్లుగా ఎన్‌ఎస్‌ఈ ఐపీవో ప్రణాళికలు కొనసాగుతున్నాయి. ఇందుకు అనుగుణంగా ఈ ఏడాది మొదట్లో సెబీ అనుమతిని కోరింది. దీంతో ఎన్‌ఎస్‌ఈ ఐపీవోపై సెబీ ఒక అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. అన్నిరకాల సమస్యలనూ పరిష్కరించుకోవలసిందిగా ఎన్‌ఎస్‌ఈని ఆదేశించింది.