
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:36 సమయానికి నిఫ్టీ(Nifty) 149 పాయింట్లు తగ్గి 23,103కు చేరింది. సెన్సెక్స్(Sensex) 329 పాయింట్లు దిగజారి 75,971 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.87 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 69.58 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.97 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో భారీ నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 4.84 శాతం నష్టోయింది. నాస్‌డాక్ 5.97 శాతం దిగజారింది.
అమెరికాతో వాణిజ్య భాగస్వాములుగా ఉన్న 60 దేశాలపై డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాల విధింపుతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు వణికిపోయాయి. ఏ దేశంపై ఎంత టారిఫ్‌ల విధింపు ఉంటుందో అని లెక్కలతో సహా ట్రంప్ వివరణతో ఆసియా నుంచి అమెరికా వరకు ఈక్విటీ మార్కెట్లు ‘బేర్’మన్నాయి. ప్రతీకార సుంకాలతో వాణిజ్య యుద్ధం తీవ్రతరమై అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటాయనే భయాలు అధికమయ్యాయి. ప్రపంచ దేశాలపై ట్రంప్ వాణిజ్య యుద్ధ ప్రభావం ఈక్విటీ మార్కెట్‌ను కుదిపేసింది.
అమెరికాకు భారత్ నుంచి ఎక్కువ ఎగుమతయ్యేవి సాఫ్ట్‌వేర్ సేవలు, మందులే. సుంకాల దెబ్బ నుంచి ఫార్మాను మినహాయించారు. ఇక సాఫ్ట్‌వేర్ సేవలపై టారిఫ్‌లు లేకున్నా.. ట్రంప్ చర్యలతో అమెరికా మాంద్యంలోకి జారే అవకాశాలున్నాయని, కంపెనీలు టెక్నాలజీపై వ్యయాలూ తగ్గించుకుంటాయనే అంచనాలు వస్తున్నాయి. అందుకే భారత ఐటీ షేర్లు భారీగా పతనం కాగా.. అమెరికాలో టెక్నాలజీ కంపెనీల సూచీ అయిన నాస్‌డాక్ అనూహ్యంగా 5 శాతానికిపైగా పతనమయింది.
ఇదీ చదవండి: వజ్రాల వ్యాపారం గతి తప్పుతుందా..?
రాబోయే రోజుల్లో ఒకవేళ కొన్ని రంగాల విషయంలో టారిఫ్‌లను సడలించినప్పటికీ కీలక పరిశ్రమలపై మాత్రం సుంకాల మోత యథాప్రకారం కొనసాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ టారిఫ్‌లతో ఇప్పటికే ప్రపంచ ఎకానమీలో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాబోయే రోజుల్లోనూ దేశాలు, పరిశ్రమలు, అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రపంచంపై టారిఫ్‌ల ప్రభావాలు రకరకాలుగా ఉండబోతున్నాయి.



(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)