
Union Budget 2023: ఎట్టకేలకు దేశ ప్రజలు ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్ 2023ను ప్రవేశపెట్టాల్సిన సమయం రానే వచ్చింది. ఈ రోజు (ఫిబ్రవరి 1 ) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోటి ఆశలతో ఎదురుచూస్తున్న బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది జనాకర్షన బడ్జెట్ ఉంటుందని భావిస్తున్నారు.
ఇక కేటాయింపులు విషయానికొస్తే.. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆకట్టుకునేలా ఉంటాయని తెలుస్తోంది. వీటితో పాటు సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసే అవకాశమూ ఉంది. కోవిడ్ తర్వాత నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ప్రజలు ఖర్చు కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. అయితే ఆదాయపు పన్ను స్లాబు విషయంలో గత 9 ఏళ్లుగా మార్పులు లేకుండా అలానే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వేతన జీవులను నిర్మలమ్మా కరుణిస్తుందనే అంటున్నారు. కాకపోతే ఈసారి కూడా భారీ వెసులుబాటు ఉండకపోవచ్చు కానీ.. కొద్దో గొప్పో మార్పులు ఉండే అవకాశం ఉందని వాదన వినిపిస్తోంది.
ప్రస్తుతం కనీస మినహాయింపు పరిమితిని రూ.5లక్షలకు పెంచాలన్నా ఉద్యోగుల నుంచి డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మధ్యతరగతిని ఆకట్టుకోవటానికి.. ముఖ్యంగా తయారీ మౌలిక సదుపాయల రంగాల్లో భారీగా ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యమిచ్చే అవకాశాలున్నాయి. ఇటీవల కొలువుల కోతలు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ క్రమంలో పట్టణ ఉపాధి కల్పన పథకానికి శ్రీకారం చుట్టే ప్రతిపాదనలు ఉన్నాయంటూన్నారు. వీటితో పాటుగా గృహరుణాలు. ఆరోగ్య ఖర్చులపై పన్నుల్లో కాసింత వెసలుబాటు కల్పించే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆరోగ్య సంరక్షణ, విద్య, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు అధిక నిధులు కేటాయించాల్సిన అవశ్యకత కనిపిస్తోంది. రైల్వే శాఖకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. రైతులకు పెట్టుబడి సాయం పెంపు ఉండచ్చని తెలుస్తోంది. ఇక బంగారం దిగుమతులపై పన్ను తగ్గించడంతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులపై దిగుమతి సుంకం పెంచే అవకాశం కనిపిస్తోంది.