
విద్యార్థి మృతదేహంతో ఆందోళన
● కళాశాల వద్ద కుటుంబీకుల ధర్నా ● రోడ్డుపై బైఠాయించి నిరసన ● కళాశాల యాజమాన్యమే చంపేసిందని ఆరోపణ ● రాత్రి వరకూ కళాశాల వద్ద ఉద్రిక్త వాతావరణం
గంగవరం : మా బిడ్డ కళాశాలలో ఆత్మహత్య చేసుకున్నాడా లేక చంపేశారా.. కళాశాల యాజమాన్యమే సమాధానం చెప్పాలి.. లేకపోతే ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ కళాశాలలో ఉరేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందిన ఇంటర్ విద్యార్థి కుటుంబికులు, బంధువులు కలిసి కళాశాల ఎదుట రోడ్డుపై ధర్నా చేశారు. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా.. కుప్పం వద్ద శాంతీపురం మండలం గెసికపల్లి గ్రామానికి చెందిన సుబ్రమణ్యం కుమారుడు యోగేష్(16) గంగవరం మండలంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఈ మధ్య వెలువడిన ఫలితాల్లో ఫెయిల్ అయ్యాడు. అయితే గత 23వ తేదీన సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపేర్ కావడం కోసం అతన్ని తల్లిదండ్రులు కళాశాలలో విడిచి వెళ్లారు. శనివారం రోజున కళాశాలలోని ఇంజినీరింగ్ విద్యార్థి ఉంటున్న హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లుగా శవమై కనిపించడంపై పలు అనుమానాలకు దారి తీసింది. విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
6 కి.మీ మృతదేహాన్ని ఎత్తుకొని నడుచుకుంటూ..
పోస్టుమార్టం ముగిసిన తరువాత ఆదివారం విద్యార్థి మృతదేహాన్ని చేతుల్లో మోసుకుంటూ దాదాపు 6 కిలోమీటర్లు రోడ్డు మార్గాన నడుచుకుని కళాశాల వద్దకు చేరుకున్నారు. అక్కడ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ నిరసన చేపట్టారు. పలమనేరు డీఎస్పీ ప్రభాకర్, గంగవరం, పలమనేరు సీఐలు ప్రసాద్, నరసింహరాజు, భాస్కర్ అక్కడికి చేరుకుని మృతుడి కుటుంబికులకు సర్ది చెప్పాలని చూసినా వారు వినలేదు. తమ బిడ్డను కళాశాల యాజమాన్యం చంపేసి నిజాలను దాచిపెడుతున్నారని వాపోయారు. పదుల సంఖ్యలో పోలీసులు , బెటాలియన్‌తో కలిసి అక్కడ గుమికూడిన విద్యార్థి కుటుంబికులను కళాశాలలోనికి అనుమతించకుండా అడ్డుకున్నారు. దీంతో కళాశాల ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చాలాసేపు తరువాత మృతుడి కుటుంబికులకు, కళాశాల యాజమాన్యానికి మధ్యన పోలీసులు రాజీ కుదర్చడంతో మృతదేహంతో అక్కడి నుంచి వెనుదిరిగారు.

విద్యార్థి మృతదేహంతో ఆందోళన