– బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు చందు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : రాష్ట్రంలో దళితుల దాడులపై హోం మంత్రి, డీజీపీకి చిత్తశుద్ధిలేదని బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు చందు మండి పడ్డారు. చిత్తూరులోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. గుట్టు చప్పుడు కాకుండా 98 మంది ఎస్సీ, ఎస్టీ స్పెషల్ పోలీస్ స్టేషన్‌ల డీఎస్పీ పోస్టింగ్‌లను ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన ఆరోపించారు. ఈ స్పెషల్ డీఎస్పీల వ్యవస్థను ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని బలపరచడానికి, ఎస్సీ, ఎస్టీ బాధితుల వర్గానికి మెరుగైన సత్వర న్యాయాన్ని అందించడానికి జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసుల ద్వారా 2014వ సంవత్సరంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ సమస్యను పరిష్కారం చేయకుండా, చట్టాన్ని నీరు గార్చేవిధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే తప్పకుండా తిరుగుబాటు ఉద్యమం తప్పదని హెచ్చరించారు. మే 5వ తేదీన చలో విజయవాడ మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. బహుజన సేన రాష్ట్ర కార్యదర్శి గోవిందప్ప, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు సతీష్, ఉపాధ్యక్షులు కుమార్, హరివర్ధన్, బాలు, భాస్కర్ పాల్గొన్నారు.

దళితుల దాడులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు