
న్యూఢిల్లీ: మాదక ద్రవ్యాలను తాను ఎప్పుడూ తీసుకోలేదని బాలీవుడ్ నటి అనన్య పాండే ఎన్‌సీబీ అధికారులకు చెప్పారు. షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు డ్రగ్స్ కొనుగోలు కోసం తాను ఎప్పుడూ సహాయం చేయలేదని పేర్కొన్నారు. ముంబై క్రూయిజ్‌లో మాదక ద్రవ్యాలు పట్టుబడిన కేసులో వరుసగా రెండోరోజు శుక్రవారం అనన్య పాండే ఎన్‌సీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఈ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్‌తో రెండేళ్ల క్రితం నాటి వాట్సాప్ సంభాషణల ఆధారంగా అనన్య పాండేను ఎన్‌సీబీ విచారిస్తోంది. 2018–19లో డ్రగ్స్ డీలర్ల నంబర్లు ఇవ్వడంలో అనన్య సహకరించినట్టుగా వారి వాట్సాప్ సంభాషణల ద్వారా తెలుస్తోందని ఎన్‌సీబీ వర్గాలు తెలిపాయి.
స్టార్ హీరోల పిల్లల గెట్ టుగెదర్ పార్టీలలో ఆర్యన్ ఖాన్‌కి అనన్య డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా వారి సంభాషణల ద్వారా అవగతమవుతోందని ఎన్‌సీబీ వెల్ల డించింది. అనన్య సమాధానాలు సంతృప్తిగా లేకపోవడంతో మళ్లీ సోమవారం విచారణకు హాజరు కావాలని ఎన్‌సీబీ ఆదేశించింది.