
వాడపల్లి క్షేత్రంలో ఘనంగా సదస్యం
మార్మోగిన గోవింద నామస్మరణ
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా గురువారం పండిత సదస్యం ఘనంగా నిర్వహించారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధానార్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్, వేద పండితులు ఖండవల్లి రాజేశ్వరవరప్రసాద్ ఆచార్యులు ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి చతుర్వేద పండితులతో ద్రవిడ వేద పారాయణ(మహాదాశీర్వచనం) అందజేశారు. స్వామివారికి డీసీ, ఈఓ చక్రధరరావు పట్టు వస్త్రాలను అందించారు. ఈ సందర్భంగా స్వామివారిని ఆభరణాలతో అలంకరించి, గ్రామోత్సవం నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులు మొక్కులు చెల్లించారు. శుక్రవారం గౌతమి గోదావరి నదిలో తెప్పోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు డీసీ, ఈఓ చక్రధరరావు తెలిపారు.
పెన్షనర్లకు ఐఆర్ ప్రకటించాలి
అమలాపురం టౌన్: పెన్షనర్లకు ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించి ఐఆర్ ప్రకటించాలని ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ పెన్షనర్ల సంక్షేమ సంఘ జిల్లా శాఖ సమావేశం డిమాండ్ చేసింది. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సంఘ జిల్లా అధ్యక్షుడు కోలా వెంకటేశ్వరరావు అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో పెన్షనర్ల సమస్యలపై చర్చించారు. సరెండర్ లీవ్‌ను నగదుగా మార్చుకునే వీలు కల్పించాలని, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌లో హెల్త్ కార్డుపై అన్ని ఆస్పత్రుల్లో, అన్ని వ్యాధులకు వైద్యం అందేలా ఉత్తర్వులు జారీ చేయాలని సమావేశం సూచించింది. ఎయిడెడ్ విద్యా రంగంలో ఉద్యోగ విరమణ చేసిన అందరికీ రీయింబర్స్‌మెంట్ వర్తించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన పెన్షన్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీఐఈవో వనుము సోమశేఖరరావుకు సంఘ ప్రతినిధులు వినతిపత్రాన్ని అందించారు. సంఘ ప్రతినిధులు బి.చంద్రరావు, సీహెచ్ సత్యనారాయణ, అత్తిలి శ్రీనివాస్, పి.గోపాలకృష్ణ, బలభద్రశర్మ, ఈశ్వరీదేవి, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
లాభదాయకంగా డ్రోన్
టెక్నాలజీ : డీఆర్‌డీఏ పీడీ
అమలాపురం రూరల్: వ్యవసాయ రంగంలో డ్రోన్ల సాంకేతిక పరిజ్ఞానం లాభదాయకంగా ఉంటుందని డీఆర్‌డీఏ పీడీ సాయినాథ్ జయచంద్ర గాంధీ అన్నారు. ఈ నెల 7 నుంచి 11 వరకు కర్నూలు ట్రిపుల్ ఐటీ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ సాంకేతిక ప్రతినిధుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం క్షేత్ర స్థాయిలో డ్రోన్ల పనితీరును అమలాపురం మండలంలో ఏ.వేమవరప్పాడు వరి సాగు క్షేత్రాల్లో ప్రయోగాత్మకంగా చూపించారు. పురుగు మందులను సమర్థంగా పిచికారీ చేయడంలో డ్రోన్లు ఉపయోగపడతాయన్నారు. ఇది రైతులకు సురక్షితమైనదని, సమయం, ఖర్చును తగ్గిస్తుందన్నారు. మాన్యుఫ్యాక్చరింగ్ ప్రతినిధి కృష్ణనాయక్ మాట్లాడుతూ, పంటల మ్యాపింగ్, నేల విశ్లేషణ, వనరుల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడంలోను, అపాయకర పనులను సురక్షితంగా చేయడంలో డ్రోన్లు ఉపయోగపడతాయన్నారు.

వాడపల్లి క్షేత్రంలో ఘనంగా సదస్యం

వాడపల్లి క్షేత్రంలో ఘనంగా సదస్యం